Friday 17 March 2017

గుణత్రయవిభాగ యోగము

గుణత్రయవిభాగ యోగము, భగవద్గీతలో పదినాల్గవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

|| 14-1 ||
శ్రీభగవానువాచ|
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః

శ్రీభగవానుడిట్లనియెను: సర్వ మునీశ్వరులును ఏ ఙ్ఞానమునెరుంగుట చేత సర్వోత్కృష్ఠమైన చిదానంద స్వరూప సిద్ధిని పొందిరో అట్టి అనంతమైన ఙ్ఞానములన్నిటిలో నుత్తమమైన చిదాకాశఙ్ఞానమును మరల చెప్పుచున్నాను.

|| 14-2 ||
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః|
సర్గేపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ

ఈ ఙ్ఞానమును పొంది నాలో నేకమై శోభిల్లువారు సృష్టికాలమున జన్మించరు. ప్రళయ కాలమున దు:ఖ పడరు. అనగా మృతినొందరు.

|| 14-3 ||
మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్|
సమ్భవః సర్వభూతానాం తతో భవతి భారత

ఓ అర్జునా! మహద్బ్రహ్మయని చెప్పబడు నామూల ప్రకృతి యోనియందు నేను చైతన్య బీజ రూపమున జీవుని ఉంచుచున్నాను. అందువలన సర్వ భూతముల ఉత్పత్తి కలుగుచున్నది.

|| 14-4 ||
సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా

ఓ కౌంతేయా! దేవమానవ పశు పక్ష్యాది సకల యోనులందు పుట్టు దేహములన్నింటికిని, మహద్బ్రహ్మయగు మూల ప్రకృతి తల్లి యనియు, పరమేశ్వరుడనైన నేను అందు బీజమునుంచు తండ్రిననియు తెలియుము.

|| 14-5 ||
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః|
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్

ఓ అర్జునా! ప్రకృతివలన బుట్టిన సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములును నాశరహితుడైన గగనాత్మను అనగా దేహిని నశించు దేహదృష్టిలోనే బంధించుచున్నది.

|| 14-6 ||
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్|
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ

పాపరహితుడవగు ఓ అర్జునా! సత్త్వరజస్తమోగుణములలో మొదటిదగు సత్త్వగుణము నిర్మలమైనదగుటచేతను ప్రకాశింపజేయునదై, ఆరోగ్యకరమైనదై, ప్రపంచసుఖములలో సంగమము కలిగించుటచేతను, శాస్త్రఙ్ఞానములో ఆశక్తిని, తృప్తిని కలిగించుటచేతను అంతవరకే ఉంచి బంధించుచున్నది.

|| 14-7 ||
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్

ఓ అర్జునా! రజోగుణము ఆశాపాశముచే కలిగి ధనాది లోకవిషయములయెడ రాగము కలుగజేయునని ఎరుంగుము. అందుచే రజోగుణము దేహమందున్న ఆత్మను ఐహిక సుఖములందాసక్తిని కలిగించి వాటికై అనేక కర్మలను చేయించి బంధించుచున్నది.

|| 14-8 ||
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత

హే భారతా! తమోగుణమన్నచో అఙ్ఞానముచే జనించిన దానినిగ నెరుంగుము. అది సర్వజీవులకు మోహమును, భ్రమను కలిగించి, అజాగ్రత్త, సోమరితనము, అతినిద్ర అనువానిచె ఆత్మను బంధించుచున్నది.

|| 14-9 ||
సత్త్వం సుఖే సఞ్జయతి రజః కర్మణి భారత|
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సఞ్జయత్యుత

ఓ అర్జునా! సత్త్వగుణము శాంతిసుఖములను కలిగించుచున్నది. రజోగుణము భోగములకై బాహ్య కర్మాడంబరములను కలిగించుచున్నది. తమోగుణమన్నచో మంచిపనిని చేయించక చెడును చేయించి ప్రమాదమును కలిగించుచున్నది.

|| 14-10 ||
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా

హే భారతా! సత్త్వగుణము రజస్తమోగుణముల కంటే శక్తితోనున్నపుడు వాటిని అణచి ఙ్ఞానసుఖాదులను కలిగించును. అట్లే రజోగుణము సత్త్వతమస్సులకంటే బలముగనున్నపుడు వాటిని అణచి అనేక కర్మలయందు ఆశక్తిని కలిగించును. అట్లే తమోగుణము సత్త్వరజోగుణములకంటే అధికముగ నున్నపుడు ఙ్ఞాన శూన్యతతో ప్రమాదములను కలిగించును.

|| 14-11 ||
సర్వద్వారేషు దేహేస్మిన్ప్రకాశ ఉపజాయతే|
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత

ఈ దేహమందున్న సర్వేంద్రియములద్వారా విఙ్ఞాన ప్రకాశమే ప్రసరించుచున్నప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి చెంది శోభిల్లిచున్నదని తెలియవలెను.

|| 14-12 ||
లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా|
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ

ఓ అర్జునా! రజోగుణము వృద్ధిలోనున్నపుదు లోభత్వము, కామ్యకర్మల నారంభించి వాటిలో మునిగి వర్తించుట, ఇంద్రియనిగ్రహము, మనశ్శాంతిలేకుండుట, మిక్కుటమైన ఆశ మొదలైనవి కలుగుచున్నవి.

|| 14-13 ||
అప్రకాశోప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ|
తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన

హే కురునందనా! తమోగుణము వృద్ధిలో నున్నపుడు బుద్ధిమాంద్యము, అఙ్ఞాన భ్రమతో కూడిన ప్రమాదములు కలుగుచున్నవి.

|| 14-14 ||
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్|
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే

దేహధారియగు జీవుడెపుడు సత్త్వగుణము అభివృద్ధిలో నుండగా మరణించునో, అపుడు ఉత్తమ ఙ్ఞానులు పొందెడు నిర్మలమైన లోకములను పొందుచున్నాడు.

|| 14-15 ||
రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే|
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే

రజోగుణము అభివృద్ధిలో నున్నపుడు మరణించినచో కామ్య కర్మాశక్తులగు మనుష్యుల కుటుంబములందు తిరిగి జన్మించుచున్నాడు. తమోగుణము అభివృద్ధిలోనున్నపుడు మృతినొందినచో ఙ్ఞానహీనులైన మూఢుల వంశమునందుగానీ, పశుపక్ష్యాదులలోగానీ పుట్టుచున్నాడు.

|| 14-16 ||
కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్|
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్

సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.

|| 14-17 ||
సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ|
ప్రమాదమోహౌ తమసో భవతోజ్ఞానమేవ చ

సత్త్వగుణమువలన వివేకముతో కూడిన ఙ్ఞానము కలుగుచున్నది. రజోగుణమువలన తరగని ఆశయను లోభము జనించుచున్నది. తమోగుణముచే అఙ్ఞాన ప్రమాదములు కలుగుచున్నవి.


|| 14-18 ||
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః

సత్వగుణమందున్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందుచున్నారు. రజోగుణము కలవారు మధ్యమమగు మనుష్యలోకమును పొందుచున్నారు. నీచగుణవృత్తులు గల తమోగుణము కలవారు అధోలోకమును అనగా మనుష్యులలో హీనులుగాగానీ పశుపక్ష్యాదులుగగానీ జన్మించుచున్నారు.

|| 14-19 ||
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి|
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్ఛతి

ఎవడు సర్వకర్మలను ప్రేరేపించి చేయునది త్రిగుణాత్మిక ప్రకృతితప్ప అన్యమెవరూ కాదనియు, తానీప్రకృతికంటె వేరైన గగనాత్మ స్వరూపునిగ నెపుడు తెలియునో అపుడు వాడు నా అనంత చిదాకాశ విశ్వగర్భస్వరూపమునే పొందుచున్నాదు.

|| 14-20 ||
గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్|
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోమృతమశ్నుతే

దేహోత్పత్తికి కారణభూతములైన ఈ త్రిగుణముల నతిక్రమించి జీవుడు జనన మరణ వార్ధక్య దు:ఖములనుండి విముక్తుడై జననమరణములులేని అమృత చిదాకాశ దైవస్వరూపమును పొంది శాశ్వతముగ శోభిల్లుచున్నాడు.

|| 14-21 ||
అర్జున ఉవాచ|
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో|
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే

అర్జునుడిట్లనియెను: హే ప్రభో! సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించినవాడు ఏ లక్షణములతో నుండును? వాని వర్తన ఎట్లుండును? ఈ త్రిగుణములను వాడెట్లు అతిక్రమించుచున్నాడు?

|| 14-22 ||
శ్రీభగవానువాచ|
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ|
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి

శ్రీ భగవానుడిట్లనియెను: హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచిపోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.

|| 14-23 ||
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|
గుణా వర్తన్త ఇత్యేవం యోవతిష్ఠతి నేఙ్గతే

ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో వాడే త్రిగుణాతీతుడు.

|| 14-24 ||
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః

సమ దు:ఖ. . . అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖములందు సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణభూషణములందు చలింపక, ధీరుడై ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.

|| 14-25 ||
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే

మానావమానములందు సమచిత్తముతోనుండి, శత్రుమిత్రులందు సముడై సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.

|| 14-26 ||
మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే|
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే

ఎవడు అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవించుచున్నాడో వాడే ఈ త్రిగుణములను సులభముగ నతిక్రమించి బ్రహ్మాకాశ విశ్వగర్భస్వరూపమును పొందుటకఱుడగుచున్నాడు.

|| 14-27 ||
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ

బ్రహ్మణో. . . అవ్యయమైన, అమృతమైన, శాశ్వతమైన, ధర్మ స్వరూపమైన, అఖండానంద స్వరూపమైన బ్రహ్మస్వరూపమునకు ఉనికిపట్టుగ మూలాధార్ముగ నున్నది నేనే కదా.

|| 14 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
భగవానుడు:
మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు. మూడుగుణాలు కలిగిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది.అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి,నేనే తండ్రి. ప్రకృతి సత్వ,రజో,తమోగుణాలచే కూడి ఉంటుంది.నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కలిగినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు. సత్వ గుణం పరిశుద్దమైనది.అది పాపాలనుండి దూరం చేస్తుంది.ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు. రజోగుణం కామ,మోహ,కోరికల కలయిక చేత కలుగుతోంది.ఈ గుణం కలిగిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు. అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది.సోమరితనం,నిద్ర,పొరపాటు అనేవాటితో బంధితులను చేస్తుంది. సత్వగుణం జీవున్ని సుఖబద్దుడిగా,రజోగుణం పనిచేయువానిగా,తమోగుణం ప్రమాదకారిగా చేస్తుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కో గుణం ఆధిపత్యం వహిస్తుంది. సర్వేంద్రియాలు జ్ఞానకాంతిచే ప్రకాశిస్తున్నప్పుడు సత్వగుణం ఉందని, లోభం,అశాంతి,ఆశలు ఉన్నప్పుడు రజోగుణం, సోమరితనం,ప్రమాదం,మూర్ఖత్వం ఉన్నప్పుడు తమోగుణం ఉన్నాయని తెలుసుకో. సత్వగుణం తో ఉన్నప్పుడు మరణించిన బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమలోకాలు,రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే మానవజన్మ,తమోగుణం ఉన్నప్పుడు చనిపోయినవాడు పశుపక్ష్యాదుల జన్మ పొందుతారు. సత్వకర్మల వలన నిర్మల సౌఖ్యం,రాజస కర్మల వలన దుఃఖం,తామసకర్మల వలన అవివేకం కలుగుతాయి. సత్వగుణం వలన జ్ఞానం,రజోగుణం వలన లోభం,తమోగుణం వలన అజ్ఞానం,భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడుతాయి. అన్ని పనుల యందూ త్రిగుణాలే కర్తలనీ,పరమాత్మ వీటికి అతీతుడని తెలుసుకొన్నవాడు నా భావం పొందుతాడు. జీవి వీటిని దాటినప్పుడే బ్రహ్మానందం పొందగలడు.

అర్జునుడు: వీటిని అతిక్రమించినవారి లక్షణాలు ఏవి?అసలు ఎలా వీటిని దాటాలి?

కృష్ణుడు:
ఈ గుణాల ఫలితాలు లభిస్తే ద్వేషింపక,లభించనప్పుడు ఆశింపక,సాక్షిగా,తను ఏమీ చేయడం లేదనుకొంటూ,తన అసలు స్వభావం గ్రహించి,సుఖదుఃఖాలను,మట్టీ,రాయి,బంగారు లను సమానంగా చూస్తూ,ప్రియము,అప్రియముల పైన సమాన దృష్టి కల్గి,ధీరుడై,పొగడ్తలు,నిందలు,మానము,అవమానము,శత్రుమిత్రులందు లందు సమబుద్ధి కల్గి,నిస్సంకల్పుడై ఉన్నవాడు గుణాతీతుడు. నిత్యమూ నన్నే నిశ్చలభక్తి తో సేవించేవాడు,త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు. పరమాత్మకు,మోక్షధర్మాలకు,సచ్చిదానందానికీ,నిరాకార బ్రహ్మానికి నేనే మూలము.




1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete