Friday 17 March 2017

పురుషోత్తమప్రాప్తి యోగము

మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ పఞ్చదశోధ్యాయః - పురుషోత్తమయోగః
|| 15-1 ||
శ్రీభగవానువాచ|
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్

శ్రీ భగవానుడన్నాడు:మొదలు పైకి శాఖలు క్రిందకు ఉన్న అశ్వత్థానిని అవ్యయమైనదని పెద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలను ఎరిగినట్లే.

|| 15-2 |
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః|
అధశ్చ మూలాన్యనుసన్తతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే|

దానికొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాలచే పెరుగుతాయి. విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు క్రింద బాగా పాతుకొని మనుష్య లోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి.

|| 15-3 ||
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా|
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా

దాని రూపము ఆ ప్రకారము(తల క్రింద ఉండే చెట్టులా)ఇక్కడ కనిపించదు. దాని మొదలూ, తుదీ, ఆధారము ఏవీ కనిపించదు. గట్టిగా పాతుకు పోయిన ఈ అశ్వత్థానిని దృఢమైన అసంగ భావమనే ఆయుధంతో ఛేధించి,

|| 15-4 ||
తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్గతా న నివర్తన్తి భూయః|
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే|
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ

ఆ తరవాత ఎక్కడికి పోతే మరలా తిరిగి రారో ఆ స్థానాన్ని వెదకాలి. ఎవరినుండి ఈ పురాతన సృష్టి కార్యము ప్రారంభము ఐనదో , ఆ ఆది పురుషుణ్ణే నేను శరణు వేడుతాను

|| 15-5 ||
నిర్మానమోహా జితసఙ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్-
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్

మానవ మోహాన్ని త్యజించిన వాళ్ళూ, సంగదోషాన్ని జయించిన వాళ్ళూ, సదా ఆత్మ జ్ఞానంలో నిమగ్నమైన వారు, విషయ వాంఛలన్నీ వెనుకకు మరలించిన వాళ్ళూ, సుఖ దుఃఖాలనే ద్వందాలనుండి విముక్తులైన వారు, మూఢత్వము పోయి అవ్యయ పదాన్ని చేరు కుంటారు.

|| 15-6 ||
న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ

ఆ పదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడకు వెళితే తిరిగి రారో అది నా పరమ ధామము

|| 15-7 ||
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి

సనాతనమైన నా అంశే జీవలోకములో జీవుడిగా మారి, ప్రకృతినుండి మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలను ఆకర్షిస్తుంది.

|| 15-8 ||
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్

ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడూ, విడిచినప్పుడూ వాయువు పూలలోంచి వాసనను తీసుకుపోయే విధముగా ఈ ఆరింటిని తీసుకొని ప్రయాణిస్తాడు.

|| 15-9 ||
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ|
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే

చెవీ, ముక్కూ, కన్నూ, నాలుకాచర్మమూ, మనస్సు వీటిని అధిష్టించి జీవుడు విషయాలను అనుభవిస్తాడు.

|| 15-10 ||
ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్|
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః

శరీరము నుండి నిష్క్రమించేటప్పుడు కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ విమూఢులు ఈయనను చూడరు. జ్ఞానులు మాత్రమే చూస్తారు.

|| 15-11 ||
యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః

సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశను చూడకలరు. మస్సు పరిపక్వము కాని వారు వివేకహీనులు సరైన జ్ఞానము లేనందువలన సాధన చేసినా చూడలేరు.

|| 15-12 ||
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్|
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్

జగత్తు నంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో.

|| 15-13 ||
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా|
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః

భూమిలోనికి ప్రవేశించి ప్రాణులందరిని నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా రసాత్మకుడైన చంద్రుడిని అయి ఓషధులన్నింటికీ పుష్టి ని ఇస్తాను.

|| 15-14 ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్

నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ ఆపానములతో కలిసి నాలుగు రకముల అన్నాన్ని ఆరగిస్తాను.

|| 15-15 ||
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ|
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్

ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నానుండే జ్ఞానము, జ్ఞాపకము, మరుపూ కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసిన వాడిని నేనే, వేదాంతాన్నిచేసిన వాడిని, వేదాన్ని తెలుసుకునే వాడిని కూడా నేనే.

|| 15-16 ||
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ|
క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే

లోకములో క్షరుడూ, అక్షరుడు అనే ఇద్దరు పురుషులు ఉన్నారు. అన్ని ప్రాణులు క్షరమైనవి. కూటస్థుణ్ణి అక్షరుడంటారు.

|| 15-17 ||
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః|
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః

ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతడిని పరమాత్మ అంటారు. నాశనము లేని ఆ ఈశ్వరుడు మూడు లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు.

|| 15-18 ||
యస్మాత్క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః|
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః

నేను క్షరానికి అతీతుడిని మరియు, అక్షరుడికన్నా కూడా ఉత్తముడినికనుక ఈ లోకములోనూ వేదములోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను.

|| 15-19 ||
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత

అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని తెలుసుకుంటాడో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను సేవిస్తాడు(పొందుతాడు).

|| 15-20 ||
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత

భారతా అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్పఅ బడినది. దీనిని అర్ధము చేసుకుంటే బుద్ధిమంతుడూ కృతకృత్యుడూ ఔతాడు

|| 15 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
శ్రీకృష్ణుడు:
వ్రేళ్ళు పైకీ ,కొమ్మలు దిగువకూ ఉన్నదీ,వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో. దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళు గా కల్గి,క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి.కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి. సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలం తో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి. బ్రహ్మజ్ఞానులై దురహంకారం,చెడుస్నేహాలు,చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు. చంద్ర,సూర్య,అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో,దేనిని పొందితే తిరిగి రానక్కరలేదో అలాంటి స్వయంప్రకాశమైనదే నా పరమపదం. నా పురాతన అంశయే జీవుడుగా మారి,జ్ఞానేంద్రియాలను మనసుగ్నూ ఆకర్షిస్తున్నారు. గాలి సువాసన తీసుకుపోయేట్లు జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు పూర్వశరీర భావాలను తీసుకెలుతున్నాడు. మనసు సహాయంతో ఇంద్రియవిషయాలను జీవుడు అనుభవిస్తున్నాడు. జీవుడి దేహాన్ని త్యజించడం,గుణప్రభావం చే మరో కొత్త దేహాన్ని పొందడం మూర్ఖులు తెలుసుకోలేరు.జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. ఆత్మానుభవం చేత తమ బుద్ధిలో దీనిని చూడగలుతారు.కాని చిత్తశుద్ది లేని సాధన చేత కనిపించదు. సూర్య,చంద్ర,అగ్నుల తేజస్సు నాదే. నా శక్తి చే,నేనే భూమియందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను.రసస్వరూపుడైన చంద్రూడినై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. జీవుల జఠరాగ్ని స్వరూపంతో అవి తినే నాలుగురకాల ఆహారాలను ప్రాణ,అపాన వాయువులతో కూడి నేనే జీర్ణం చేస్తున్నాను. నేనే అందరి అంతరాత్మను.జ్ఞాపకం,జ్ఞానం,మరుపు నావలనే కలుగుతున్నాయి.నేనే వేదవేద్యుడను,వేదాంతకర్తను,వేదవేత్తనూ కూడా అయి ఉన్నాను. క్షర,అక్షర అని రెండు రకాలు.ప్రపంచభూతాలన్నీ క్షరులనీ,కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు. వీరిద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.అతడే మూడు లోకాలను పోషిస్తోన్న అక్షయుడూ,నాశనం లేనివాడు. అందువలనే పరమాత్మ వేదాలలో పురుషోత్తమునిగా కీర్తింపబడ్డాడు. భ్రాంతిని వదిలి,నన్నే పరమాత్మగా తెలుసుకొన్నవాడు సర్వజ్ఞుడై,అన్నివిధాలా నన్నే సేవిస్తాడు. అర్జునా!అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీ నిమిత్తమై చెప్పాను.దీనిని గ్రహించినవాడు జ్ఞానియై,కృతార్థుడవుతాడు.



1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete