Friday, 17 March 2017

భగవద్గీత

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.


భగవద్గీత ఆవిర్భావం:
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత విశిష్టత:
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:

-->సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
-->పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
-->శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
-->ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
-->నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)

-->నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)

<img>1D509B48-76A4-4002-8F6A-87CD237B117C.jpg</img>
గీతా సారము:
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి). కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.

ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.

కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.

ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము


భగవద్గీత కాలం:
భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.

గీతా శ్లోక సంఖ్య:
భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రస్తుతం లభ్యమౌతున్న సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:

షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.

ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలొ (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.

ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.
భగవద్గీత విభాగాలు

భగవద్గీత విభాగాలు:
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము".

 ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు:

1) అర్జునవిషాద యోగము:
"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.

2) సాంఖ్య యోగము:
సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు. శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి(ఆత్మ) శాశ్వతము. ఈ విషాయినికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.

3) కర్మ యోగము:
కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి. కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.

4) జ్ఞాన యోగము:
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -

" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."

5) కర్మసన్యాస యోగము:
ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"

6) ఆత్మసంయమ యోగము:
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.

7) జ్ఞానవిజ్ఞాన యోగము:
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.

భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.

ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.

8) అక్షరపరబ్రహ్మ యోగము:
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.

9) రాజవిద్యారాజగుహ్య యోగము:
కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -

" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."

"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"

10) విభూతి యోగము:
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.

" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,

11) విశ్వరూపసందర్శన యోగము:

శ్రీకృష్ణుడు విశ్వరూపములలో
భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.

"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.

అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

12) భక్తి యోగము:
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

13) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.

క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.

ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

14) గుణత్రయవిభాగ యోగము:
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.

సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

15) పురుషోత్తమప్రాప్తి యోగము:
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.

16) దైవాసురసంపద్విభాగ యోగము:
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------

భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము,క్షమా,ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.

ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.

17) శ్రద్దాత్రయవిభాగ యోగము:
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?

18) మోక్షసన్యాస యోగము:
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.


అర్జునవిషాద యోగము

అర్జునవిషాద యోగము, భగవద్గీతలో మొదటి అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


'అర్జునవిషాద యోగములో ముఖ్య విషయాలు : అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.

||శ్రీమద్భగవద్గీత ||

||ఓం శ్రీ పరమాత్మనే నమః ||

||అథ శ్రీమద్భగవద్గీతా ||

అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః


 ||1-1||:
ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ

ధృతరాష్ట్రుడు పలికెను.
ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?


||1-2||
సఞ్జయ ఉవాచ |
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్

సంజయుడు పలికెను:
అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను.

||1-3||
పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా

ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిషుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.


||1-4||
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః

ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు.


||1-5||
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః

దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు.


||1-6||
యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః

పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే.


||1-7||
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే

బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.


||1-8||
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.


||1-9||
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః

ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు.


||1-10||
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది.


||1-11||
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి

అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి.


||1-12||
తస్య సఞ్జనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్

అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు.


||1-13||
తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోభవత్

ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.

||1-14||
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు.


||1-15||
పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు.


||1-16||
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు.


||1-17||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః

ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ;


||1-18||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్

ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

||1-19||
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్

ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

||1-20||
అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః

అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు,

||1-21||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత

ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు.

||1-22||
యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే

యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి

||1-23||
యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.

||1-24||
సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్

సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి,

||1-25||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి

భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు.

||1-26||
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా

అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు.

||1-27||
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్

ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి,

||1-28||
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్

అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా;

||1-29||
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే

నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి.

||1-30||
గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః

గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది.

||1-31||
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే

కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.

||1-32||
న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా

ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి.

||1-33||
యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ

ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.

||1-34||
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు.

||1-35||
ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే

మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా?


||1-36||
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః

జనార్ధనా! దృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది.

||1-37||
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ

అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము.

||1-38||
యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్

లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ,

||1-39||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన

జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

||1-40||
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత

కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది.

||1-41||
అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః

కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.

||1-42||
సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

||1-43||
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః

వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి.

||1-44||
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ

జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము.

||1-45||
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః

అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.

||1-46||
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్

ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది.

||1-47||
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః

సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు.

||1||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయఃఆధ్యాయ సంగ్రహం:
ధృతరాష్ట్రుడు, సంజయుడు:
యుద్ధం ఆపమని వ్యాసుడు ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు. తాను అసహాయుడనని, ఆ పని తన వల్ల కాదని ధృతరాష్ట్రుడు విన్నవించుకొన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం అని గ్రహించిన తరువాత యుద్ధం విశేషాలు దర్శించడానికి, వివరించడానికి వీలుగా వ్యాసుడు సంజయునకు దివ్యమైన దృష్టి, అవగాహన, శీఘ్రగమనం వంటి శక్తులిచ్చాడు. వాటి సహాయంతో సంజయుడు ధృతరాష్ట్రుడికి భూమండలం విశేషాలు దర్శించి వివరించాడు. తరువాత రాజు ఆనతిపై యుద్ధభూమికి వెళ్ళాడు.

అలా వెళ్ళిన సంజయుడు పది రోజులకు గాని తిరిగి రాలేదు. వస్తూనే మహావీరుడు భీష్మ పితామహుడు రణభూమిలో కూలి అంపశయ్యపై విశ్రమించాడని చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. పిదప ధృతరాష్ట్రుడు మొదటినుండి యుద్ధం గురించి చెప్పమని సంజయుడిని ఇలా అడిగాడు.

ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నా బిడ్డలు, పాండవులు ఏమి చేశారు?
ఇదే భగవద్గీతలో మొదటి శ్లోకం. అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.

మహాయోధులు సిద్ధం:
వ్యూహాలు తీరియున్న సేనను చూసి దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని వద్దకు వెళ్ళి ఇరు పక్షాలలో మహాయోధులను గురించి ప్రస్తావించాడు. "పాండవుల పక్షాన సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఐదుగురు ద్రౌపది పుత్రులు (ప్రతివింధ్యుడు, సుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు) వంటి మహావీరులున్నారు. మన (కౌరవ) పక్షాన తమరు (ద్రోణుడు), భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు వంటి మహావీరులున్నారు. అంతా జీవితాలను పణంగా పెట్టి యుద్ధరంగానికి వచ్చారు. భీముని రక్షణలో ఉన్న పాండవ సేనకంటే భీష్ముని రక్షణలో ఉన్న కౌరవ సేన అపరిమితము, అజేయము. కనుక అందరూ భీష్ముని రక్షించడానికి సావధానంగా ఉండాలి" - అని దుర్యోధనుడు ద్రోణుడితో అన్నారు.

కురువృద్ధుడు, పితామహుడు అగు భీష్ముడు సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించాడు. కృష్ణుడు పాంచజన్య శంఖాన్నీ, అర్జునుడు దేవదత్త శంఖాన్నీ అలాగే ఇతరులు తమతమ శంఖాలనూ పూరించారు. భేరీ భాంకారాలతో యుద్ధరంగం దద్ధరిల్లింది.

అర్జునుని ఉత్సుకత:
అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం కపిధ్వజుడైన అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయోవృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూశాడు.

అర్జునుడి దుఃఖం:
వారిని చూడగానే గుండె కరిగిపోయి అర్జునుడు కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. "కృష్ణా! అందరూ మనవాళ్ళే, వారిలో కొందరు పూజ్యనీయులు. ఈ స్వజనాన్ని చూస్తుంటే నా శరీరావయవాలు పట్టు తప్పుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. గాండీవం చేజారుతున్నది. బంధుమిత్రులకోసమే మనం రాజ్య భోగాలు కోరుకుంటాం. అలాంటి బంధుమిత్రులే ఇక్కడ ప్రాణాలను వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. యుద్ధం కారణం చేత కుల క్షయం సంభవిస్తుంది. అయ్యో రాజ్య సుఖ లోభం కారణంగా స్వజనులను చంపే ఘోర పాపకృత్యానికి ఒడిగట్టాము కదా? ది దారుణం. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత నేను, నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి" అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.
సాంఖ్య యోగము

సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగములో కురుక్షేత్రంలో మొహరించిన సేనల వర్ణన, వారిని చూసి అర్జునుని మనస్సు వికలం కావడం, తాను యుద్ధం చేయలేనని అర్జునుడు అనడం చెప్పబడినాయి. అర్జునుని విషాదం ఈ రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం ఆరంభంలో కొనసాగింది. చివరకు అతను నీవు తప్ప నాకు వేరు గతి లేదు. నాకు ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. అని కృష్ణునికి శరణాగతుడై చతికిలపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే ఈ సాంఖ్య యోగము..


అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

|| 2-1 ||
సఞ్జయ ఉవాచ|
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్|
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః

సంజయుడన్నాడు:
ఆ ప్రకారంగా కరుణతో ఆవహింప బడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపుతో, విషాదంలోఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు.

|| 2-2 ||
శ్రీభగవానువాచ|
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్|
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున

శ్రీ భగవానుడన్నాడు:
ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తినీ రెండింటిని చెడగొట్టుతుంది.

|| 2-3 ||
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప

అర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా. క్షుద్రమైన హృదయ దౌబల్యాన్ని విడిచి లేచి నిలబడు.


|| 2-4 ||
అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన

అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను?

|| 2-5 ||
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్

మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.

|| 2-6 ||
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః

ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.

|| 2-7 ||
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్

కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.

|| 2-8 ||
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్

ఇంద్రియాలను దహింపచేసే నాయీశోకాన్ని తగ్గించే దేదో నేను తెలుసుకోలేకుడా ఉన్నాను. భూమిలో ఏకచ్చత్రాధిపత్యం కాని, దేవలోకాధిపత్యం కాని దీనిని తొలగించ లేదు.

|| 2-9 ||
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ

ఓ రాజా. అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చేయనని గోవిందునితో పలికి మాట్లాడకుండా ఊరకున్నాడు.

|| 2-10 ||
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః

భారతా! రెండుసేనల మధ్య విషాదంలో పడిన అతణ్ణి చూసి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు.

|| 2-11 ||
శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః

శ్రీ భగవానుడన్నాడు.
నీవు విచారించదగని వారికోసం విచారిస్తున్నావు. ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు. చనిపోయిన వారి గురించి కానిబతికి ఉన్న వారి గురించి కాని పండితులు శోకించరు.

|| 2-12 ||
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్

నీవుకాని నేను కాని ఈ రాజులు కాని లేని సమయం భూతకాలంలో లేదు, వర్తమానంలో ఉండదు.

|| 2-13 ||
దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి

ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాకలుగుతాయో, అలాగే మరోదేహం లభించడం కూడాను. వివేకి ఈవిషయంలో భ్రమపడడు.


|| 2-14 ||
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత

కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ, సుఖదః ఖాలను కలిగిస్తాయి అవి వస్తూ పోతుంటాయి. నిలకడలేనివి. అర్జునా వాటిని సహించాలి.

|| 2-15 ||
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.

|| 2-16 ||
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః

అసత్యానికి శక్తి లేదు. సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈరెండింటి అసలు స్వరూపం తత్వ జ్ఞానులచేత దర్శింప బడినది.

|| 2-17 ||
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి

దేని చేత ఈప్రపంచం యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు నాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు.

|| 2-18 ||
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత

నిత్యమైన నాశరహితమైన పరిణామాలులేని శారీరా ధారి అయిన ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా యుద్ధం చేయి.

|| 2-19 ||
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే

ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు.

|| 2-20 ||
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే

అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.


|| 2-21 ||
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్

జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆపురుషుడ ఎలా ఎవరిని చంపిస్తాడు? ఎవరిని చంపుతాడు?

|| 2-22 ||
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ

మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలను విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు.


|| 2-23 ||
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః

దీనిని శస్త్రాలు చేదించవు, అగ్ని కాచదు, నీరుతడపదు, గాలి ఎండించదు.


|| 2-24 ||
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయమక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః

ఇది ఛేధించ రానిది, కాల్చ రానిది, తడప రానిది, ఎండించ రానిది. నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది.

|| 2-25 ||
అవ్యక్తోऽయమచిన్త్యోऽయమవికార్యోయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి

ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం విడిచి పెట్టు.


|| 2-26 ||
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి

ఇక దీనిని నిత్యం పుట్టేది, నిత్యం గిట్టేదిగా భావించినా మహానుభావుడా|అప్పుడు కూడా ఇలా విచారించ తగదు.

|| 2-27 ||
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి

పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో, అలాగే చనిపోయిన వారికి జన్మ తప్పదు. అందుచేత శోకింపనవసరం లేని దాని కోసం నీవు శోకింప తగదు.

|| 2-28 ||
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా

అర్జునా జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఎమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పనిలేదు.

|| 2-29 ||
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్

దీనిని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకరు ఆశ్చర్యంగా చెబుతాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు.


|| 2-30 ||
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి

అర్జునా! అన్ని దేహాలలో ఉన్న దేహి నిత్యమైన వాడు కనుక చంపబడడు. అందుచేత ఎవరిని గురించీ నీవు విచారించతగదు.

|| 2-31 ||
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్క్షత్రియస్య న విద్యతే

స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించ తగదు. క్షత్రియుడికి ధర్మ యుద్ధంకన్నామేలైనది లేదు.


|| 2-32 ||
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్

అర్జునా! యాదృచ్చికంగా లభించినదీ స్వర్గద్వారాన్ని తెరిపించేదీ అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు.

|| 2-33 ||
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి

ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో, దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవై పాపం పొందుతావు.

|| 2-34 ||
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే

ప్రజలు నిన్ను అప్రతిష్టకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అపకీర్తి మరణంకంటే బాధాకరం.


|| 2-35 ||
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్

ఈ మహారధులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకనగా చూస్తారు.


|| 2-36 ||
అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్

నీ శత్రువులు నిన్ను గురించి పలురకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్ధతని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా?

|| 2-37 ||
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః

చనిపోయావా, స్వర్గాన్ని పోందుతావు. గెలిచావా, రాజ్యాన్ని అనుభవిస్తావు. అందు చేత లే కౌంతేయ; యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడువై లేచి నిలబడు.


|| 2-38 ||
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి

సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా. ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు.


|| 2-39 ||
ఏషా తేభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి

ఇంతవరకు నీకు జ్ఞానాన్ని భోదించడం జరిగింది. ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి వినుము. పార్ధుడా; ఈ జ్ఞానం తోడూ ఉంటే కర్మ బంధాన్ని ఛేదిస్తావు.


|| 2-40 ||
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్

ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ విపరీత ఫలితాలు కానీ ఉండవు. ఈ ధర్మం ఏకొంచం ఆచరించినా భయం నుండి రక్షిస్తుంది.

|| 2-41 ||
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోऽవ్యవసాయినామ్

కురునందనా! ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి.


|| 2-42 ||
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః

అర్జునా; అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.


|| 2-43 ||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి

కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైస్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.

|| 2-44 ||
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే

భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్ఛయ జ్ఞానం ఏర్పడదు

|| 2-45 ||
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్

అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి నీవు వాటికి అతీతుడైనై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యముశుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను నర్జించి(వదిలి), ఆత్మజ్ఞానివి కా.


|| 2-46 ||
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః

అంతటా జలం పొంగుతున్నప్పుడు జలకాల శాల ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.

|| 2-47 ||
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోస్త్వకర్మణి

కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.

|| 2-48 ||
యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ|
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

ధనంజయా! యోగంలో నిలిచి, సగం వదిలి, కర్మఫలితాలు సిద్ధించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది.

|| 2-49 ||
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ|
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః

ధనంజయా! సమత్వ బుద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్ప మైనది. కాబట్టి ఆసమ బుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యేవారు పిసిని గొట్టులు.

|| 2-50 ||
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే|
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్

సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలని రెంటినీ వదులుతాడు. అందుచేత నీవు యోగంకోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే.

|| 2-51 ||
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్

సమబుద్ధితో కర్మనుండి జనించే ఫలితమునందు ఆసక్తి త్యజించే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు.

|| 2-52 ||
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ

ఎప్పుడు నీబుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో, అప్పుడు వినదగిన, వినిన విషయాలనుండి విముక్తుడివి అవుతావు.


|| 2-53 ||
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి

విన్నవాటితో వేసారిపోయిన నీబుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నీవు యోగాన్ని పొందుతావు.

|| 2-54 ||
అర్జున ఉవాచ|
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్

అర్జునుడు ఇలా అడిగాడు: కేశవా సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు?


|| 2-55 ||
శ్రీభగవానువాచ|
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే

భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడుఇక్కడమనస్సు ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే సత్యాన్ని లేదా సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చుసమాధి స్థితి సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు.మనస్సు నిశ్చలంగా, స్థిరంగా మనస్సునిలుకడ తెలియర గురువు అనుగ్రహంవల్ల సూక్ష్మత తత్త్వాన్ని… సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం.

|| 2-56 ||
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే

ధుఃఖాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలకోసం తహతహ పడనివాడు, రాగ భయ, క్రోదాలని విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు.

|| 2-57 ||
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఎక్కడా దేనికీ తగుల్కోకుండా, శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచివుంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది.

|| 2-58 ||
యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

తాబేలు తన అంగాలను ఉప సంహరించు కున్నట్లుగా, ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువులనుండి ఎప్పుడు ఉప సంహరించు కుంటాడో అప్పుడు అప్పుడు ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది.


|| 2-59 ||
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే

ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుడి నుండి విషయ వస్తువులు దూరంగా పోతాయి. కాని, అభిరుచి అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది.


|| 2-60 ||
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః

అర్జునా! పండితుడి ఇంద్రియాలు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనస్సును విషయాల మీదికి లాగి వేస్తాయి కదా;


|| 2-61 ||
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

వాటినన్నింటిని బాగా నిగ్రహించి, యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది.

|| 2-62 ||
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోభిజాయతే

విషయధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం వలన కామము, కామం వలన క్రోధం జనిస్తాయి.


|| 2-63 ||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి

క్రోధం వలన విభ్రాంతి కలగుతుంది. విభ్రాంతితో మతిమరపు, దానితో బుద్ధి నాశనం కలిగి, బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు.

|| 2-64 ||
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి

రాగద్వేషాలనుండి విడివడి, స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు.

|| 2-65 ||
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే

మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్నచిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది.

|| 2-66 ||
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్

నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడుకానివానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేనివాడికి సుఖమెక్కడ?

|| 2-67 ||
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి

ఏమనస్సు సంచరించే ఇంద్రియాలకు లోబడి వాటిననుసరిస్తుందో, అది నీటిలో పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి వేస్తుంది.

|| 2-68 ||
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

అందు వలన ఓ మహానుభావుడా! ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో, అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.

|| 2-69 ||
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః

అందరికి ఏది రాత్రియో, సంపూర్ణ నిగ్రహ వంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి.

|| 2-70 ||
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ

పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్ళు ఎలాచేరుకుంటాయో, ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమౌతాయో, శాంతిని పొందుతాడు. కోరికలకు దాసుడైనవాడు పొందలేడు.

|| 2-71 ||
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి

అన్ని కోరికలను వదిలి, అహంకార మమకారాలు వీడి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు.


|| 2-72 ||
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి

ఆర్జునా ఇదే బ్రాహ్మీస్థితి, దీనిని పొందాక ఇక భ్రమించడు. ఇందులోచివరి సమయంవరకు నిలిస్తేబ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు.


|| 2 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః


అధ్యాయ సంగ్రహం:

అర్జునుని శరణాగతి:
అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు. కాని అర్జునుడు "నేను గురువులను, పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను. అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా. నాకు దుఃఖం ఆగడం లేదు. నేను నీ శిష్యుణ్ణి. నాకేది మంచిదో నీవే చెప్పు" అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో "దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు. తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని, వర్తమానం గురించికాని బాధపడరు. అయినా నేను, నువ్వు, ఈ రాజులు గతంలోనూ ఉన్నాము. భవిష్యత్తులోనూ ఉంటాము. బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే. సుఖదుఃఖాలు శాశ్వతం కావు. ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు.

ఆత్మ లక్షణాలు:
దేహం అనిత్యం, కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించినా ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కాని, చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు. ఇది సనాతనము అనగా ఎప్పుడు ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్నికాని, గాలి కాని, నీరు గాని మరియు ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావక తప్పదు. మరలా పుట్టక తప్పడు. దీనికి బాధపడనవసరం లేదు. అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.

విద్యుక్త ధర్మ నిర్వహణ:
క్షత్రియులకు యుద్దధర్మం శ్రేష్ఠం. నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనంచే చేయలేదని అనుకుంటారు. అపకీర్తి వస్తుంది. అమర్యాద పాలవుతావు. శత్రువులు చులకన చేస్తారు. మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖదుఃఖాలను, జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.

నిష్కామ కర్మ:
ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచం ఆచరించినా గొప్పఫలితాన్ని ఇచ్చి సంసారభయాన్ని దాటగలవు. ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏక కారణంగా ఉంటుంది. కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానంకాని, బుద్ధికాని లేక జననమరణాలు పొందుతుంటారు. ప్రకృతి యొక్క మూడుగుణాలకు అతీతుడవై, సుఖదుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి. బావితో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి, జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది. పని చెయ్యి. కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు. అలా అని పని చేయడం ఆపకు.జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగిఉండు. ఈ బుద్ది కలిగినవారు పాపపుణ్యాలు నశింపచేసుకుని మోక్షము పొందుతారు. నీ మనసు స్థిరం కావాలి.

స్థితప్రజ్ఞుడి లక్షణాలు:
అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు, నడవడిక గురించి అడుగగా కృష్ణుడు "అన్ని కోరికలను వదిలి, దుఖానికి కలత పొందక, సుఖానికి పరవశించక, అనురాగము, కోపము, భయములను వదిలివేసి తన ఆత్మ యందె సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడుతాడు" అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది. విషయాలను గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి, అది నెరవేరకపోవడం వలన కోపం, ఆ కోపం వలన అవివేకం, అవివేకం వలన యుక్తాయుక్తజ్ఞానం, బుద్ధి నశించి అథోగతిపాలవుతాడు.

విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం, కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు. నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అదిలేనివాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలందు నిద్రతోను, సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.

బ్రాహ్మిస్థితి:
సముద్రంలోకి ఎన్ని నీళ్ళు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా, గంభీరంగా చెలియలికట్ట దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని, కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మిస్థితి అంటారు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే పొందగలడో అతడే బ్రహ్మనిర్వాణపదాన్ని పొందుతాడు.కర్మ యోగము

కర్మ యోగము, భగవద్గీతలో మూడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ తృతీయోధ్యాయః - కర్మయోగః

|| 3-1 ||
అర్జున ఉవాచ|
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన|
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ

అర్జునుడు ఇలా అన్నాడు; జనార్ధనా! నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవా! ఘోరకర్మలో నన్ను ఎందుకు నియోగించుతావు?


|| 3-2 ||
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయామ్

అయోమయమైన మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగిస్తున్నావు.ఏది నాకు శ్రేయమో దానిని నిశ్చయముగా చెప్పు.

|| 3-3 ||
శ్రీభగవానువాచ|
లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్

భగవంతుడు ఇలాపలికాడు; పాప రహితుడా ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం చేతను యోగులకు కర్మయోగం చేతను సాధన, సృష్టికి ముందే నాచేత చెప్పబడినది.

|| 3-4 ||
న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోశ్నుతే|
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి

కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు.కేవలం సన్యసించడం వలన సరైన సిద్ధి కలగదు.


|| 3-5 ||
న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్|
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః

ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు.ప్రకృతి జన్యమైన గుణాల వలన అన్ని కర్మలు అవశ్యంగానే చేయబడుతున్నాయి.

|| 3-6 ||
కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్|
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే

ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో,అతడు పరమ మూర్ఖుడు,కపటాచారి అని పిలవ బడతాడు.

|| 3-7 ||
యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేర్జున|
కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే

అర్జునా;జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి,కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ఎవరు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడు అవుతాడు.


|| 3-8 ||
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః|
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః

నీ విధ్యుక్త కర్మని నీవు చెయ్యి;కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు.కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు.

|| 3-9 ||
యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర లోకోऽయం కర్మబన్ధనః|
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసఙ్గః సమాచర

యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉన్నది.కుంతీకుమారా యజ్ఞ కర్మలనే సంగమము వదిలి కర్మలను చక్కగా చెయ్యి.


|| 3-10 ||
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|
అనేన ప్రసవిష్యధ్వమేష వోస్త్విష్టకామధుక్

యజ్ఞాలతో సహా ప్రజలను శృష్టించి ప్రజాపతి పూర్వం ఇలాచెప్పాడు.యజ్ఞం వలన మీరు వృద్ధి పొందండి.అది మీ ఇష్ట కామధేనువు.

|| 3-11 ||
దేవాన్భావయతానేన తే దేవా భావయన్తు వః|
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ

దేవతలను ఈ యజ్ఞంలో ఆరాధించండి.ఆదేవతలు మిమ్మలను అనుగ్రహిస్తారు.


|| 3-12 ||
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః

యజ్ఞం చేత ఆరాధించబడిన దేవతలు మీకు ఇష్ట భోగాలను ఇస్తారు.వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనిభవించేవాడు చోరుడే అవుతాడు .

|| 3-13 ||
యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్

యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినేసజ్జనుడు అన్ని పాపాలనుండి విముక్తుడు అవుతాడు.తమ కోసం మాత్రం ఎవరు వండు కునే పాపాత్ములు వాళ్ళు పాపాన్నే తింటారు.


|| 3-14 ||
అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః

అన్నము వలన జీవులు పుట్టును,అన్నము మేఘము వలన పుట్టును,మేఘము యజ్ఞము వలన పుట్టును,యజ్ఞము కర్మ వలననే సంబవము.


|| 3-15 ||
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్

కర్మ బ్రహ్మదేవుని వలన జనించినది ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు.కాబట్టి సర్వ వ్యాపకమగు పర బ్రహ్మము నిత్యమూ యజ్ఞములో ప్రతిష్టితమై ఉంటుందని తెలుసుకో.


|| 3-16 ||
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి

ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి,ఇంద్రియలోలుడు,అర్జునా;అతడు జీవించడం వ్యర్ధం.

|| 3-17 ||
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే

ఆత్మలోనే రమిస్తూ,ఆత్మలో తృప్తి పడుతూ,ఆత్మలోనే పరిపూర్ణ తృప్తిని పొందే వాడికి చేయదగిన కార్యమంటూ లేదు.


|| 3-18 ||
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః

అతడికి పని చేయడం వలన ప్రయోజనం కాని ,మానడంవలన దోషం ఏమీ ఉండదు.తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా ఆధారపడడు.

|| 3-19 ||
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః

జనకుడు మొదలైన వారు(నిష్కామ)కర్మల ద్వారా మోక్షాన్ని పొందారు.లోకకల్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మ చేయడమే నీకు తగును.

|| 3-20 ||

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|
లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి

జనకుడు మొదలైన వారు(నిస్కామ)కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు.లోకకల్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును.


|| 3-21 ||
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

శ్రేష్టుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు.అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది.

|| 3-22 ||
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన|
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

అర్జునా నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని లేదు.ఇంతకు ముందు పొందకుండా ఉన్నది ముందు పొందవలసినది ఏమీలేదు.అయిననూ కర్మలలో వర్తిస్తాను.

|| 3-23 ||
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః

అర్జునా;నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే,మనుష్యులు అన్ని విధాల నామార్గమే అనుసరిస్తారు.

|| 3-24 ||
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః

నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి.వర్ణ సంకరానికి కారకుడనౌతాను.ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.

|| 3-25 ||
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత|
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్

అర్జునా;అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి.

|| 3-26 ||
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్

కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు.తాను యోగంలో నిలిచి చక్కగా పని చేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.

|| 3-27 ||
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే

ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి.అహంకార వలన భ్రమించిన మూఢుడూ తానే కర్తనని తలపోస్తాడు.


|| 3-28 ||
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే

మహాబలుడా;గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడుగుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి ఆ కర్మలలో తగుల్కోడు.

|| 3-29 ||
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|
తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్

ప్రకృతి యొక్క గుణాల వలన మోహంలో పడిన వారు గుణ కర్మలలో మునుగుతుంటారు.సరిగా తెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన జ్ఞాని చెదర కొట్టరాదు.

|| 3-30 ||
మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః

సర్వ కర్మలను నాయందు సమర్పించి,చిత్తాన్ని ఆత్మలో నిలిపి,ఆశా మమకారాలను వదిలి,ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి.

|| 3-31 ||
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః|
శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః

నాయీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు.

|| 3-32 ||
యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః

ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్టించరో ఆ తెలివితక్కువ వాళ్ళు సర్వ జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో.

|| 3-33 ||
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి|
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి

జ్ఞానవంతుడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు.ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి.నిగ్రహమేమి చేస్తుంది.


|| 3-34 ||
ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ|
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ

ప్రతి ఇంద్రియ విషయంలోను రాగాద్వేషాలు ఉంటాయి కర్మయోగి వాటికి లోబడ రాదు.అవే అతనికి శత్రువులు.


|| 3-35 ||
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

బాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం మేలు.పర ధర్మం భయంకర మైనది.

|| 3-36 ||
అర్జున ఉవాచ|
అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః

అర్జునుడు ఇలాఅడిగాడు; కృష్ణా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు?ఆ ప్రేరణశక్తి ఎవరిది?ఎవరి కారణంగా పాపం చేస్తాడు?

|| 3-37 ||
శ్రీభగవానువాచ|
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్

శ్రీ భగవానుడన్నాడు; ఇవి కామము,క్రోధము,రజోగుణం నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని తెలుసుకో.

|| 3-38 ||
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్

అగ్నిని పొగ ఆవరించినట్లు,అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.

|| 3-39 ||
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా|
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ

కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది.ఇది జ్ఞానానికి నిత్య శత్రువు.దీనితోజ్ఞాని జ్ఞానం కప్పబడి ఉంటుంది.

|| 3-40 ||
ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్

ఇంద్రియాలు మనస్సు,భుద్ధి,కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి.ఈ కామం జ్ఞానాన్ని కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ పరుస్తుంది.

|| 3-41 ||
తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్

అందువలన భరత కుల శ్రేష్టుడా;ముందుగానీవు ఇంద్రియాలని నిగ్రహించి,జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.

|| 3-42 ||
ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః|
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః

ఇంద్రియాలు గొప్పవని చెబుతారు.ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు.మనస్సు కన్నాగొప్పది బుద్ధి,బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ.

|| 3-43 ||
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా|
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్

మహాబాహుడా ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని నిన్ను నీవు నిగ్రహించుకొని,కామరూపి అయిన శత్రువుని జయించు.

|| 3 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మయోగో నామ తృతీయోధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్దం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు " ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞాన యోగంగానూ, యోగులకు కర్మయోగంగానూ చెప్పాను. కర్మలు(పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగి, ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు. యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధ హేతువులు. బ్రహ్మదేవుడు యజ్ఞాల వలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు.

యజ్ఞాల ప్రాముఖ్యత:
 యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు. యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు. కర్మల వలన యజ్ఞాలు, యజ్ఞం వలన వర్షం, వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి. పరమాత్మ వలన వేదాలు, వాటి వలన కర్మలు సంభవించాయి. ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి, ఆచరించని వారు పాపులు. ఆత్మజ్ఞానికి చేయవలసిన కర్మలు లేవు. అతడు సర్వస్వతంత్రుడు ఐన కారణంగా కర్మలు చేయడం వలన అతనికి లాభం కానీ, చేయకపోవడంవలన అతనికి నష్టం కాని ఉండవు. నీవు కూడా నిష్కామంగా కర్మలు చేయి. జనకుడు మొదలగువారు కూడా నిష్కామ కర్మలు చేసారు. ఉత్తముల కర్మలను, ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు. నాకు కూడా మూడు లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం, లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. ఓ అర్జునా అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్ట్లే , జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి. జ్ఞాని పనిచేసేవారి బుధ్ధి చలింపచేయకుండా తను పని చేస్తూ వారి చేత కూడా పని చేయించాలి. అన్ని కర్మలూ ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నానని తలుస్తాడు. కాని జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకార రహితంగా ఉంటాడు. అలా ఆసక్తి కలిగినవారి మార్గాన్ని జ్ఞానులు ఆటంక పరచరాదు. అన్ని కర్మలనూ నాకే సమర్పించి, కోరికలనూ, అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడవై యుద్దం చేయి. పై విధంగా చేసినవారు సమస్తకర్మ దోషాల నుండి విముక్తులవుతారు. మిగిలినవారు భ్రష్ఠులు. మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు. అందువలన మరణించినా ఫర్వాలేదు.


కామం యొక్క ప్రభావం:
అప్పుడు అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాధానం రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం. పొగ చే అగ్ని, మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనస్సును ఆవరించి, వివేకాన్ని హరించి మనుషులను భ్రమింప చేస్తోంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో కామాన్ని విడువు. శరీరం కంటే ఇంద్రియాలు, వాటి కన్నా మనసు, మనసు కన్నా బుధ్ధి , బుధ్ధి కన్నా ఆతమ గొప్పది. ఆత్మ వీటన్నిటి కన్నా పైన ఉంటుంది. కాబట్టి బుధ్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు.జ్ఞాన యోగము

జ్ఞాన యోగము, భగవద్గీతలో నాలుగవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


అథ చతుర్థోధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

|| 4-1 ||
శ్రీభగవానువాచ|
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్

శ్రీ కృష్ణభగవానుడు పలికినది:- అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించాను.సూర్యుడు మనువుకి చెప్పాడు.మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు.

|| 4-2 ||
ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః|
స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప

ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులుఎరుగుదురు.ఓ పరంతపా కాలగతిలో ఈ గొప్పయోగం ఈ లోకంలో నశించి పోయింది.

|| 4-3 ||
స ఏవాయం మయా తేऽద్య యోగః ప్రోక్తః పురాతనః|
భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్

ఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు,స్నేహితుడవు ఐన నీకు భోధించాను.ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ కూడా.

|| 4-4 ||
అర్జున ఉవాచ|
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః|
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి

అర్జునుడు ఇలా అడిగాడు:- నీ జన్మ ఇటీవలది.సూర్యుని జన్మ ఎంతో ముందున్నది.నీవు సూర్యునికి ఉపదేశించావని అన్నావు.దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?

|| 4-5 ||
శ్రీభగవానువాచ|
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున|
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప

శ్రీ కృష్ణభగవానుడు ఇలా పలికాడు:- అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి.నేను వాటన్నిటిని ఎరుగుదును.నీవు ఎరుగవు.


|| 4-6 ||
అజోऽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్|
ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవామ్యాత్మమాయయా

జన్మ లేనివాడినీ,అవ్యయుడినీ,జీవులందరికి అధిపతినైనా,నాప్రకృతిని అధిరోహించి నామాయవలన జన్మిస్తుంటాను.

|| 4-7 ||
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్

అర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.

|| 4-8 ||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే

సాధువులను రక్షించడానికి,దుష్టులను నాశనం చేయడానికీ,ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.


|| 4-9 ||
జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః|
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున

అర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా తెలుసుకుంటారో,అతడు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టడు.

|| 4-10 ||
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః

రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకున్నారు.

|| 4-11 ||
యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః

అర్జునా నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను.మనుష్యులెప్పుడూ నాజాడలోనే సంచరిస్తారు.

|| 4-12 ||
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా

కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు,మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!

|| 4-13 ||
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్

నాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన సృష్టించ బడ్డాయి.వాటిని సృష్టించిన వాడినైనా,నేను కర్తను కాననీ,మార్పులేని వాడిననీ తెలుసుకో.

|| 4-14 ||
న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా|
ఇతి మాం యోऽభిజానాతి కర్మభిర్న స బధ్యతే

నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు.

|| 4-15 ||
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్

ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందువలన పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి.

|| 4-16 ||
కిం కర్మ కిమకర్మేతి కవయోऽప్యత్ర మోహితాః|
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్

కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతిలో పడతారు.దేనిని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విముక్తి పొందుతావో ఆ కర్మ విషయం నీకు చెబుతాను.

|| 4-17 ||
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః|
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః

కర్మల గురించి తెలుసుకోవాలి.వికర్మల అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి.కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది.

|| 4-18 ||
కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః|
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్

కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు.అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు.

|| 4-19 ||
యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః|
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః

ఎవరు కామసంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో,జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన అతణ్ణి వివేకి అని విద్వాంసులంటారు.

|| 4-20 ||
త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః|
కర్మణ్యభిప్రవృత్తోऽపి నైవ కిఞ్చిత్కరోతి సః

కర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై,కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అవుతాడు.

|| 4-21 ||
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః|
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

ఆశలేక,మనశరీరాలను నిగ్రహించి,అన్నిటియందు పరిగ్రహ భావాన్ని వదిలి,కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.

|| 4-22 ||
యదృచ్ఛాలాభసన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః|
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే

యాదృచ్చికంగా లభించిన దానితో సంతృప్తుడై,ద్వందాలకు అతీతుడై,మాత్సర్యం లేకుండా,ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసినా బద్ధుడు కాడు.

|| 4-23 ||
గతసఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః|
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే

సంగభావం పోయి ముక్తుడై,జ్ఞానంలో నిలిచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించే వాని కర్మ పూర్తిగా నశిస్తుంది.

|| 4-24 ||
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా

కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించే వారకి బ్రహ్మమే హవిస్సు,బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించ బడుతుంది.అతనిచే అందుకో బడిన గమ్యం కూడా బ్రహ్మమే

|| 4-25 ||
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే|
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి

కొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు.కొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని (తనలోని జీవభావాన్ని)అర్పిస్తారు.

|| 4-26 ||
శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి|
శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి

శ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరూ నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు.మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.

|| 4-27 ||
సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే|
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే

మరికొందరు జ్ఞానేంద్రియ,కర్మేంద్రియ కర్మలన్నింటిని జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమనమనే అగ్నిలో వేల్చుతారు.

|| 4-28 ||
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే|
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః

మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య,తపో,యోగ,స్వాధాయ,జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు.

|| 4-29 ||
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే|
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః

అలాగే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస నిచ్వాసములను నిరోధించి ఆపానానికి ప్రాణాన్ని ప్రాణాన్ని ఆపానానికి ఆహుతులుగా అర్పిస్తారు.

|| 4-30 ||
అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి|
సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః

మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ,ప్రాణాన్ని ప్రాణానికి ఆహుతులుగా అర్పిస్తారు.వీరందరూ యజ్ఞానాలను ఎరిగినవారే.యజ్ఞం వలన కల్మషాలను హరింప చేసుకుంటారు.


|| 4-31 ||
యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్|
నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోऽన్యః కురుసత్తమ

అర్జునా! యజ్ఞములో సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము.యజ్ఞము చేయని వారికి ఈ లోకమేలేదు,పరలోకమెక్కడ?

|| 4-32 ||
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|
కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే

ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి.అవి అన్నీ కర్మల వలన జనిస్తాయని తెలుసుకో.ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు.

|| 4-33 ||
శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరన్తప|
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే

అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసేయజ్ఞంకంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది.అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.

|| 4-34 ||
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః

జ్ఞానాన్ని ఆత్మార్పణభావం,సేవ,ప్రశ్నించడం ద్వారా తెలుసుకో,జ్ఞానులు,తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.

|| 4-35 ||
యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ|
యేన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి

అర్జునా! దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో దేనిచేత అశేషమైన జీవరాశుల్ని నీలోను,నాలోను చూడగలుగుతావో ఆ జ్ఞానాన్ని పొందు.

|| 4-36 ||
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః|
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి

పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ జ్ఞానమనే పడవతో దాటగలవు.

|| 4-37 ||
యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా

అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా,జ్ఞానమనే అగ్ని కర్మలను కాచివేస్తుంది.

|| 4-38 ||
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే|
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి

జ్ఞానంలాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.

|| 4-39 ||
శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి

శ్రద్ధతో కూడిన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండి,జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు.జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమైన శాంతిని పొందుతాడు.

|| 4-40 ||
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|
నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః

జ్ఞానం,శ్రద్ధలేని సంశయాత్ముడు నశించిపోతాడు.సంశయంలో పడ్డవాడికి ఈ లోకంలేదు పరలోకమూ లేదు.సుఖం కూడా లేదు.

|| 4-41 ||
యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసఞ్ఛిన్నసంశయమ్|
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ

అర్జునా యోగం వలన కర్మలను వదిలించుకొని,జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు.

|| 4-42 ||
తస్మాదజ్ఞానసమ్భూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః|
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత

అందుచేత అజ్ఞానం వలన జనించి నీహృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి,యోగాన్ని అవలంబించు.అర్జునా! లేచి నిలబడు.

|| 4 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానకర్మసంన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు, మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు. కాని కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు. మరి మనము ఇప్పటి వాళ్లము. నివు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు. నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను. ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ప్రతి యుగంలోను నేను అవతరిస్తాను. ఈ విధంగా తెలుసుకొన్నవాడు, రాగ, ద్వేష, క్రోధ, భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను. మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. కర్మ ఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను. నేను ఆకర్తను, అవ్యయుడను. నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు. ఇలా చేసేవారిని కూడా అంటవు. జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు. ఏ కర్మలు చేయాలో, ఏవి చేయకూడదో చెప్తాను విను. కర్మ, అకర్మ, వికర్మ అని మూడు రకాలు. కర్మగతి గాఢమైనది. కర్మలలో ఆకర్మలను, ఆకర్మలలో కర్మలను చూసేవాడు, ఫలాపేక్ష రహితుడు, కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్దం చేసేవాడు బుద్ధిమంతుడు. కోరికలేనివాడు, జయాపజయాల పట్ల సమబుద్దిగలవాడు, సందేహ రహితుడు, ఈర్ష్యా రహితుడు బంధాలలో చిక్కుకోడు.

ఈశ్వర ప్రీతిగా మాత్రమె కర్మలు చేయువాడికి ప్రారబ్దము కూడా నశిస్తుంది కాని బాధించవు. ఇవ్వబడునది, ఇచ్చేవాడు, ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా బ్రహ్మమే.కొందరు ఆత్మను ఆత్మ యందె, ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమనే అగ్నిలో, మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో, మరికొందరు వాయు గమనాన్ని నిరోదించి అపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో అపానాన్ని, ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు.

ద్రవ్యరూప యజ్ఞాన్ని, వ్రతరూప తపోయజ్ఞాన్ని, ప్రాణాయామ పరమైన యోగయజ్ఞాన్ని, వేదాభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి. ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు. యజ్ఞశేషం అమృతం లాంటిది. యజ్ఞం చేయనివాడికి ఇహపరాలు రెండూ ఉండవు. ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి. అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే.తత్వవేత్తలను వినయముతో సేవించి, ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే నా వలెనే సమస్తాన్ని నీయందే చూడగలవు. మోహానికి గురికావు. ఎంతపాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు. కర్రలను అగ్ని వలె, కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది. జ్ఞానమును మించినది లేదు. కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకొంటున్నాడు. శ్రద్దజ్ఞానాలు లేనివారు, సందేహాలు కలిగినవాడు, నమ్మకం లేని వాడు చెడిపోతారు. ఇహపరాలు రెండింటికీ దూరమవుతారు. పరమార్థ జ్ఞానంతో కర్మలను, బ్రహ్మజ్ఞానంతో సందేహనివృత్తిని చేసుకోన్నవాడిని కర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానం చే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించు. లే.కర్మసన్యాస యోగము

కర్మసన్యాస యోగము, భగవద్గీతలో ఐదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ పఞ్చమోధ్యాయః - సంన్యాసయోగః

|| 5-1 ||
అర్జున ఉవాచ|
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి|
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్

అర్జునుడు ఇలా అడిగాడు: - ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.

|| 5-2 ||
శ్రీభగవానువాచ|
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే

శ్రీ కృష్ణుడన్నాడు: - కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.

|| 5-3 ||
జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి|
నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే

ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే నిత్యసన్యాసీ అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే బంధాలనుండి తేలికగా విడుదల పొందుతాడు.

|| 5-4 ||
సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః|
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్

పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.

|| 5-5 ||
యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|
ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి

సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత పొందబడుతుంది. సంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు.

|| 5-6 ||
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి

ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.

|| 5-7 ||
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః|
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే

కర్మ యోగంతో కూడుకుని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.

|| 5-8 ||
నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్|
పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్

పరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు

|| 5-9 ||
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్

మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయడం లేదనీ భావిస్తాడు.

|| 5-10 ||
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా

ఎవరైతే కర్మలను బ్రహ్మముకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.

|| 5-11 ||
కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి|
యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే

యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.

|| 5-12 ||
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే

యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు పోయి బంధింప బడతాడు.

|| 5-13 ||
సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ|
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్

మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.

|| 5-14 ||
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః|
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే

భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది.

|| 5-15 ||
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః|
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః

భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.

|| 5-16 ||
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్

ఎవరిలో ఐతే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.

|| 5-17 ||
తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః|
గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః

ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభాసం చేసేవాళ్ళు పాపములు నశింప బడిన వారై తిరిగిరాని స్థిని పొందుతారు.

|| 5-18 ||
విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః

మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.


|| 5-19 ||
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః|
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.

|| 5-20 ||
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్|
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః

స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.

|| 5-21 ||
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్|
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే

బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.

|| 5-22 ||
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే|
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః

కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు.

|| 5-23 ||
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః

ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, అతడే సుఖవంతుడు ఔతాడు.

|| 5-24 ||
యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః|
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి

ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు.

|| 5-25 ||
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః

కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు

|| 5-26 ||
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్|
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్

కామక్రోధాలనుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.

|| 5-27 ||
స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ

బాహ్యస్పర్శలన్నీ అరికట్టి, దృష్టిని భ్రకుటి మీద నిలిపి , నాసికలో సంచరించేప్రాణాపాలనుసమానం చేసి

|| 5-28 ||
యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః

ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే.

|| 5-29 ||
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి

యజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల హితం కోరేవాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్విత శాంతి పొందుతాడు.

|| 5 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సంన్యాసయోగో నామ పఞ్చమోధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:

అర్జునుడు: కర్మలను వదిలివేయమని ఒకసారీ, కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు. వీటిలో ఏది అనుసరించాలో చెప్పు?

కృష్ణుడు:కర్మత్యాగం, నిష్కామ కర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు. జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండూ ఒకటే అనే భావం కలిగిఉండాలి. యోగియై సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు, శుద్ద మనస్కుడు, ఇంద్రియ నిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రించినా, శ్వాసించినా, మాట్లాడుతున్నా - ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక, ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు.యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు.

కర్మ, కర్మ చేయడం, దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు. ఆ ప్రేరణను మాయ చేస్తోంది. ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగినవారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే దృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.

సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగని స్థిరబుద్ది కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన, దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ, ఆడుకుంటూ, ప్రకాశిస్తుంటారో, పాపపుణ్యాలను నశింపచేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. దృష్టిని భ్రూమధ్యంపై కేంద్రీకరించి ప్రాణ, అపాన మొదలగు వాయువులను సమం చేసి మనసు, బుద్ది, ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక, కోపం, భయం మొదలగువాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు,యాగాలకు నేనే భోక్తను. నేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు....