Friday 17 March 2017

జ్ఞానవిజ్ఞాన యోగము

జ్ఞానవిజ్ఞాన యోగము, భగవద్గీతలో ఏడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

|| 7-1 ||
శ్రీభగవానువాచ|
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు :- నాలో మనస్సును లగ్నం చేసి,యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి,నిస్సశయంగా,క్షుణ్ణంగా ఎలా తెలుసుకో గలవో దానిని గురించి వినుము.

|| 7-2 ||
జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః|
యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే

అనుభవంతో కూడిన శాస్త్ర పరిజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను.దీనిని తెలుసుకున్నాక నీకు వేరే తెలుసుకోవలసినది ఏమీ ఉండదు.

|| 7-3 ||
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః

వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తారు.అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యదార్ధంగా తెలుసుకుంటారు.

|| 7-4 ||
భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా

భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం మరియు మనస్సు బుద్ధి,అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

|| 7-5 ||
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్

ఓ మహానుభాహుడా! ఇది అల్పమైనది.ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ నా పరమైన ప్రకృతి అని తెలుసుకో.దాని వలననే ఈ జగత్తు భరించబడుతుంది.

|| 7-6 ||
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ|
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో.యావత్తు జగత్తుకు యొక్క ఉత్పత్తి,నాశనములకు మూలము నేనే అని తెలుసుకో.

|| 7-7 ||
మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ

ధనుంజయా! నాకన్నా ఏక్కువైనదీ ఏదీలేదు.జగత్తు యావత్తు దారంలో మణులవలె నాలో గుచ్చబడి ఉన్నది.

|| 7-8 ||
రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః|
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు

కౌంతేయా! నేను నీటిలోని రుచిని సూర్యచంద్రులలోని వెలుగును,వేదాలలోని ఓంకారాన్ని,ఆకాశంలో ఉన్న శబ్ధ గుణాన్ని.మానవులలోని పట్టుదలను.

|| 7-9 ||
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు

నేను పృథ్విలోని వాసనని.అగ్నిలోని వేడిని.జీవుళ్ళలోని ప్రాణాన్ని.తపస్సు చేసేవారిలో తపస్సుని.

|| 7-10 ||
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్

అర్జునా అందరి జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో.బుద్ధిమంతుల లోని తెలివిని.ప్రతిభా వంతుల లోని ప్రతిభని నేను.

|| 7-11 ||
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|
ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని నేను.జీవులలో ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.

|| 7-12 ||
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే|
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి

ఇంకా ఏవి తామసిక,రాజసిక,సాత్విక భావాలో అవన్నీ నా వలన వస్తాయని గ్రహించు.అయితే నేను వాటిలో లేను అవినాలో ఉన్నాయి.

|| 7-13 ||
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్|
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్

మూడుగుణాలలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచం యావత్తూ బ్రాంతిలో పడి,వీటికన్నా అతీతమూ,అవ్యయమూ అయిన నన్ను గుర్తించలేదు .

|| 7-14 ||
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే

దివ్యమైన,త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది.నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

|| 7-15 ||
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః

దుర్మార్గులు మూఢులు,మాయ చేత జ్ఞానం నశించిన వారు,అసురభావాన్ని ఆశ్రయించిన వారు ఐన నరాధములు నన్ను సేవించరు.

|| 7-16 ||
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున|
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ

భరత కుల శ్రేష్టుడైన ఓ అర్జునా! ఆర్తుడూ,జిజ్ఞాసువూ,అర్ధార్ధీ,జ్ఞాని అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు.

|| 7-17 ||
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే|
ప్రియో హి జ్ఞానినోऽత్యర్థమహం స చ మమ ప్రియః

ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు.అటువంటి వాడికి నేను ఎక్కువ ప్రియుణ్ణి.అతడే నాకు కూడా ఇష్టుడు.

|| 7-18 ||
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్

వీరందరూ ఉదారులే.జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా అభిప్రాయము .ఎందుకంటే అతడే సర్వోత్తమైన గతి అని నన్నే ఆశ్రయించి ఉంటాడు.

|| 7-19 ||
బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః

అనేక జన్మల తరువాత నరుడు జ్ఞాన వంతుడై సర్వమూ వాసుదేవుడని నన్ను కొలుస్తాడు.అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు

|| 7-20 ||
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేన్యదేవతాః|
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం హరించుకు పోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర దేవతలను ఆరాధిస్తారు.

|| 7-21 ||
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి|
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని కోరతాడో ఆయా భక్తునికి ఆయాదేవతయందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను.

|| 7-22 ||
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే|
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు.నాచే ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతారూపంద్వారా పొందుతాడు .

|| 7-23 ||
అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి

అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా ఉంటుంది.దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు,నన్ను ఆరాధించేవారు నన్ను చేరుతారు.

|| 7-24 ||
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః|
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్

పరమము,సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని,తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరంకాని పరిమితమైన రూపంగా భావిస్తారు.

|| 7-25 ||
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః|
మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను.నన్ను ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివాణ్ణిగా తెలుసుకో లేదు.

|| 7-26 ||
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున|
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన

నేను గతించిన జీవులను,ఇప్పుడు ఉన్నవాళ్ళనూ,ముందు పుట్టబోయే వారినీ ఎరుగుదును.నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు.

|| 7-27 ||
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత|
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వందాల మోహం వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నాయి.

|| 7-28 ||
యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్|
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః

పుణ్య కర్మల వలన ఏజనులయొక్క పాపం అంత మైనదో,వాళ్ళు,ద్వంద మోహాలనుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు.

|| 7-29 ||
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే|
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్

జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆబ్రహ్మమూ ఆత్మ తత్వాన్ని యావత్తు కర్మనీ తెలుసుకుంటారు.

|| 7-30 ||
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః|
ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః

ఆధి భూతంతో,ఆధిదైవంతో,ఆధియజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళుమనస్సు వశంలో ఉంచుకుని ప్రయాణ కాలంలోకూడా నన్ను గుర్తుంచుకుంటారు.

|| 7 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
కృష్ణుడు:
నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.నా ఈ ప్రకృతి భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనసు,బుద్ది,అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు.

దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది.

నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంతి,వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే.

త్రిగుణాలన్ని నా ఆధీనమే,నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతున్ని ఐన నన్ను తెలుసుకోలేకపోతున్నారు.

త్రిగుణాతీతమూ,దైవతమూ ఐన నా మాయ దాటడానికి సాధ్యము కాదు.ఐనా నన్ను శరణు జొచ్చువారికి అది సులభసాధ్యము. రాక్షసభావులూ,మూఢులూ,మూర్ఖులూ,నీచులూ నన్ను పొందలేరు. ఆపదలపాలైనవాడు,తెలుసుకోగోరేవాడు,సంపదను కోరేవాడు,జ్ఞాని అను నాలుగు విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు నలుగురూ ఉత్తములే కాని జ్ఞాని ఎల్లపుడు నా యందే మనసు నిలుపుకొని సేవిస్తాడు కాబట్టి అతడు నాకు,అతడికి నేను చాలా ఇష్టులము మరియు అతడు శ్రేష్టుడు.

అనేకజన్మల పిదప "వాసుదేవుడే సమస్తము" అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు.

ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేస్తున్నాను.వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు.నన్ను సేవించినవారు నన్ను పొందుతారు.

నిర్వికారమూ,సర్వాతీతము ఐన నా స్వస్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు.యోగమాయచే కూడినవాడవడం చేత నన్ను వారు తెలుసుకోలేరు. భూత,భవిష్యత్,వర్తమాన కాలాలలోని సర్వజీవులూ నాకు తెలుసు.నేనెవ్వరికీ తెలియదు. రాగద్వేషాలచే కలిగిన సుఖదుఃఖాలచే జీవులు మోహించబడుచున్నారు.పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్నీ,పరబ్రహ్మనూ తెలుసుకుంటారు. భూతాధిపతిని,దైవాన్ని,యజ్ఞాధిపతిని ఐన నన్ను తెలుసుకొన్నవాళ్ళూ మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు.

1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete