Friday, 17 March 2017

శ్రద్దాత్రయవిభాగ యోగము

శ్రద్దాత్రయవిభాగ యోగము, భగవద్గీతలో పదిహేడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ సప్తదశోధ్యాయః - శ్రద్ధాత్రయవిభాగయోగః

|| 17-1 ||
అర్జున ఉవాచ|
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః

అర్జునుడన్నాడు:కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది?సాత్వికమా, రాజసికమా, తామసికమా?

|| 17-2 ||
శ్రీభగవానువాచ|
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు

శ్రీ భగవానుడన్నాడు:మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా ఉంటుంది. అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను.

|| 17-3 ||
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|
శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః

అర్జునా! ప్రతివారిలోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది ఔతుంది.


|| 17-4 ||
యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః

సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.

|| 17-5 ||
అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః|
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః

ఢంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన, పీడా కరమైన తపస్సు చేసే వారూ,

|| 17-6 ||
కర్షయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః|
మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్

తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.

|| 17-7 ||
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు

మానవులకు మూడు విధాలైన ఆహారం ప్రియమౌతుంది. యజ్ఞమూ, తపస్సూ, దానమూ కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను.

|| 17-8 ||
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః|
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః

ఆయువు సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం ప్రీతి వీటిని పెంచేవీ, రసంతో నిండినివీ, జిడ్డుతో నిగనిగలాడేవీ, కడుపులో చాలా కాలం ఉండేవీ, మనస్సునాకర్షించేవీ అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి.


|| 17-9 ||
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః|
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః

చేదూ, పులుపూ, ఉప్పూ, వేడీ, కారమూ, అన్నీ అతిగా కలిగి, పొడిపొడిగా ఉండి, దాహం పుట్టిస్తూ, దుఃఖాన్నీ, శోకాన్నీ, రోగాన్నీ కలిగించేవి రాజసికులకు ఇష్టం.

|| 17-10 ||
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్|
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్

వండిన తరువాత ఝాము దాటి పోయినదీ, రుచి పూర్తిగా పోయినదీ, పాసిపోయినదీ, వాసన గొట్టుతుందీ, ఎంగిలిదీ, అశుభ్రమైనదీ అయిన భోజనం తామసికులకు ఇష్టం.

|| 17-11 ||
అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే|
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః

ఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం.

|| 17-12 ||
అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్|
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్

అర్జునా! ఫలాన్ని ఆశిస్తూనో, డంభం కోసంమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞం అని తెలుసుకో

|| 17-13 ||
విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే

శాస్త్ర విధి లేకుండా అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది.

|| 17-14 ||
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడం, శుచిత్వం, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు.

|| 17-15 ||
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే

ఇతరులను బాధింపనిదీ, సత్యనమూ, ప్రయమూ, హితమూ అయిన వాక్కు, స్వాధ్యాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.

|| 17-16 ||
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే

ప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూ, శుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.

|| 17-17 ||
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|
అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే

పై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, ఏ లాభమూ కోరకుండా, నిగ్రహంచేత చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది.

|| 17-18 ||
సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్|
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్

సత్కారంకోసమూ, మాన మర్యాద కోసమూ డంభంతోనూ ఏ తపస్సు చేయబడుతుందో దానిని నిలకడా, స్తిరత్వమూ లేని రాజసిక తపస్సుఅంటారు.

|| 17-19 ||
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః|
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్

సరిగ్గా అర్ధం చేసుకోకుండా, తన్ను తాను హింసించు కుంటూ లేదా ఇతరుకలకు పీడా కరంగా చేయబడే తామసికము అనబడుతుంది.

|| 17-20 ||
దాతవ్యమితి యద్దానం దీయతేऽనుపకారిణే|
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్

దానం చేయడం కర్తవ్యం అనేభావంతో, తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల పాత్రలని చూచి, చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది.

|| 17-21 ||
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః|
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్

ప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ, భాధపడుతూ ఇచ్చే దానిని రాజిసిక దాన మంటారు

|| 17-22 ||
అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్

అపాత్రునికి, తగని తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది.

|| 17-23 ||
ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః|
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా

ఓం తత్ సత్ అనే బ్రహ్మపదార్ధన్ని నిర్ధేశించే మూడు సంకేతాలని చెప్పబడుతుంది, వీటితోనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుపబడినాయి.

|| 17-24 ||
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః|
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్

అందుచేత "ఓం"అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యమూ యజ్ఞ దాన తపః కర్మలు చేయబడు తున్నాయి.

|| 17-25 ||
తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః|
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః

"తత్"అంటూ మోక్షాన్ని కాక్షించే వారు ఫలం ఆశించకుండా, వివిధాలైన యజ్ఞాలూ, తపస్సులూ చేస్తుంటారు.

|| 17-26 ||
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే|
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే

పరమసత్యానికీ, మంచితనానికి సూచనగా "సత్"అనే పదాన్ని ప్రయోగిస్తారు. అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదం ప్రయోగిప పడుతుంది.

|| 17-27 ||
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే|
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే

యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతుంది. దాని కోసం చేసే కర్మని కూడా "సత్"అనే అంటారు.

|| 17-28 ||
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ

అలాంటిఅర్జునా! శ్రద్ధలేని హోమం, దానం, తపస్సు, మరి యే క్రియ అయినా సరే అది"అసత్"అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహంలో కానీ, పరంలో కానీ ఫలం ఇవ్వదు.

|| 17 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు:
కృష్ణా! శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా, రాజసులా, తామసులా? వీరి ఆచరణ ఎలాంటిది?

కృష్ణుడు:
పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక, రాజస, తామస శ్రద్ధలు ఏర్పడతాయి. స్వభావంచే శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు. శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు. సాత్వికులు దేవతలనీ, రాజసులు యక్షరాక్షసులనీ, తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు. శాస్త్రనిషిద్దమైన తపస్సును, దారుణ కర్మలను చేసేవాళ్ళూ, దంభం, అహంకారం తో శరీరాన్నిశరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు. ఆహార, యజ్ఞ, తపస్సు, దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి. ఆయుస్సునూ, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి, చమురుతో కూడి, పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం. చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని, రోగాలనూ, చింతనీ కల్గిస్తాయి. చద్దిదీ, సారహీనమూ, దుర్వాసన కలదీ, పాచిపోయినదీ, ఎంగిలిదీ, అపవిత్రమైనదీ అయిన ఆహారం తామసము. శాస్త్రబద్దంగా ఫలాపేక్ష లేక చేసేది సాత్విక యజ్ఞం. ఫలాపేక్షతో, పేరు కోసం, గొప్పను చాటుకోవడం కోసం చేసేది రాజస యజ్ఞం. శాస్త్రవిధి, అన్నదానం, మంత్రం, దక్షిణ, శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం. దేవతలను, పెద్దలను, గురువులను, బ్రహ్మవేత్తలను పూజించడం, శుచి, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస శరీరంతో చేయు తపస్సు. బాధ కల్గించని సత్యమైన ప్రియమైన మాటలు, వేదాభ్యాసం మాటలచే చేయు తపస్సు. నిశ్చల మనస్సు, మృదుత్వం, మౌనం, మనఃశుద్ధి కల్గిఉండడం మనసుతో చేయు తపస్సు. ఫలాపేక్ష రహితం, నిశ్చల మనస్సు, శ్రద్దతో చేయు తపస్సు సాత్వికం. కీర్తిప్రతిష్ఠల ఆశతో గొప్పను ప్రదర్శిస్తూ చేయు తపస్సు రాజసికం. దీని ఫలితం కూడా అల్పమే. పరులకు హాని కల్గించు ఉద్దేశ్యంతో తనను తాను హింసించుకుంటూ, మూర్ఖఫు పట్టుదలతో చేయు తపస్సు తామసికం. పుణ్యస్థలాలలో దానం, పాత్రతను బట్టి దానం, తనకు సహాయపడలేని వారికి దానం చేయడం సాత్వికం. ఉపకారం ఆశించి, ప్రతిఫలం కోరుతూ కష్టపడుతూ ఐనా చేసే దానం రాజస దానం. అపాత్ర దానం, అగౌరవం చే చేసే దానం తామస దానం. 'ఓంతత్"'సత్" అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలు. వాటి వలనే వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణులూ కల్పించడం జరిగింది. అందుచేతనే యజ్ఞ, దాన, తపోకర్మలన్నీ 'ఓం'కార పూర్వకం గానే చేస్తారు. మోక్షం కోరువారు ప్రయోజనం కోరకుండా చేసే యాగ, దాన, తపోకర్మలన్నీ "తత్" శబ్దం చే చేయబడుతున్నాయి. "సత్" శబ్దము కు ఉనికి, శ్రేష్టము అని అర్థం. నిశ్చలనిష్ట, పరమాత్ముని గూర్చి చేసే అన్ని కర్మలు కూడా "సత్" అనే చెప్పబడుతున్నాయి. శ్రద్ద లేకుండా ఏమి చేసినా "అసత్" అనే చెప్పబడతాయి. వాటివలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.



No comments:

Post a comment