Friday 17 March 2017

దైవాసురసంపద్విభాగ యోగము

దైవాసురసంపద్విభాగ యోగము, భగవద్గీతలో పదహారవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


అథ షోడశోధ్యాయః - దైవాసురసమ్పద్విభాగయోగః

|| 16-1 ||
శ్రీభగవానువాచ|
అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్

అభయం సత్వసుద్ధి జ్ఞానయోగంలో నిలవడం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ(దైవీ పురుషుడికి కలుగుతాయి)

|| 16-2 ||
అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్|
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్

అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం

|| 16-3 ||
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత

తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.

|| 16-4 ||
దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్

అర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . . ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.

|| 16-5 ||
దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|
మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ

దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా! విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు.

|| 16-6 ||
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్దైవ ఆసుర ఏవ చ|
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు

ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.

|| 16-7 ||
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే

అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.

|| 16-8 ||
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్

జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు.

|| 16-9 ||
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః

ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.

|| 16-10 ||
కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేశుచివ్రతాః

వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన, మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా ప్రవర్తిస్తారు.

|| 16-11 ||
చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః|
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః

వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ, కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.

|| 16-12 ||
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్

వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను సమకూర్చుకోవాలని అనుకుంటారు.

|| 16-13 ||
ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్|
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్

ఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను. ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.

|| 16-14 ||
అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి|
ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్సుఖీ

ఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.

|| 16-15 ||
ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః

నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో భ్రాంతి చెందుతారు.

|| 16-16 ||
అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేऽశుచౌ

అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని, కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.

|| 16-17 ||
ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్

తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా యజ్ఞాలు చేస్తారు.

|| 16-18 ||
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోऽభ్యసూయకాః

అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని, తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

|| 16-19 ||
తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్|
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు

ఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

|| 16-20 ||
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్

అర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.

|| 16-21 ||
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్

ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి.

|| 16-22 ||
ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః|
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్

కౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. దాని వలన పరమగతిని పొందుతాడు.

|| 16-23 ||
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్

తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు. సుఖాన్ని పరమగతిని కూడా పొందడు.

|| 16-24 ||
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి

|| 16 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
దైవాసురసమ్పద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః

అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది.

ఆధ్యాయ సంగ్రహం:
శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.

దైవగుణాలు:
భయం లేకుండడం, నిర్మల మనసు, అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, దోషాలు ఎంచకుండడం, మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీతి పట్ల ఆశ లేకుండడం.

రాక్షసగుణాలు:
గర్వం, పొగరు, దురభిమానం, కోపం, పరుషత్వం, అవివేకం.

దైవగుణాలు మోక్షాన్ని, రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి. నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు. దైవ, రాక్షస స్వభావులని రెండు రకాలు. రాక్షసస్వభావం గురించి చెప్తాను. మంచీ చెడుల విచక్షణ, శుభ్రత, సత్యం, మంచి ఆచారం వీరిలో ఉండవు. ప్రపంచం మిథ్య అని, దేవుడు లేడని ,స్త్రీ పురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు. వీరు లోకకంటకమైన పనులు చేస్తారు. కామం కలిగి దురభిమానం, డంభం, మదం, మూర్ఖ పట్టుదల కలిగి అపవిత్రంగా ఉంటారు. కామం, కోపాలకు బానిసలై, విషయవాంఛలే ముఖ్యంగా వాటి అనుభవం కోసం అక్రమ ధనార్జన చేస్తూ నిత్యం ఆశలలో చిక్కుకొని ఉంటారు.

"ఇది నాకు దొరికింది. దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను. నాకు ఇంత ఉంది, ఇంకా వస్తుంది. ఈ శత్రువును చంపాను. మిగిలిన శత్రువులందరినీ చంపుతాను. నేను సర్వాధికారిని. బలవంతుడిని, సుఖిని, ధనికుడిని. నాకెదురు లేదు. నాకు ఎవరూ సమానం కాదు. యాగలూ, దానాలూ చేస్తాను. నేనెప్పుడూ సంతోషినే" అని అనుకుంటూ కామం, భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు. ఆత్మస్తుతి, డబ్బు మదంతో శాస్త్రాన్ని వీడి పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు. అన్ని దుర్గుణాలు కలిగి అసూయతో అంతర్యామి నైన నన్ను తిరస్కరిస్తారు. వీరు తిరిగితిరిగి ఇలాంటి జన్మలే పొందుతారు. వీరు ఎన్నటికీ నన్ను చేరలేక అంతకంతకూ హీనజన్మలనే పొందుతుంటారు. కామం, కోపం, పిసినారితనం ఈ మూడూ నరకానికి తలుపులు. ఆత్మజ్ఞానమును నాశనం చేస్తాయి. కాబట్టి ఈ మూడింటినీ వదిలిపెట్టాలి. వీటిని వదిలిన వాడే తపస్సు, యాగం మొదలగు వాటి వలన ఆత్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతారు. వేదశాస్త్రాలను లక్ష్యపెట్టని వారికి శాంతి లేక మోక్షం లభించవు. కాబట్టి ఏ పనిచెయ్యాలి, చేయకూడదు అన్నదానికి వేదశాస్త్రాలే నీకు ప్రమాణం. వాటి ప్రకారమే నీ కర్మలను చెయ్యి.



1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete