Friday 17 March 2017

విశ్వరూపసందర్శన యోగము

విశ్వరూప సందర్శన యోగము, భగవద్గీతలో పదకొండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథైకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః

|| 11-1 ||
అర్జున ఉవాచ|
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|
యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ

అర్జునుడిట్లనియె: నన్ను అనుగ్రహించుటకై కరుణతో నీచేత చెప్పబడిన పరమ రహస్యమైన అధ్యాత్మఙ్ఞానముచే నా అఙ్ఞాన మోహమంతా మాయమైపోయినది.

|| 11-2 ||
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా|
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్

హే కృష్ణా! సర్వభూతముల సృష్టి, స్థితి, లయ రహస్యమును గూర్చి నీ శాశ్వతమయిన అవ్యయమైన మహా మహిమను గూర్చి నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని.

|| 11-3 ||
ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర|
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ

ఓ పరమేశ్వరా! నీ మహాద్భుత విశ్వరూప మహిమను గూర్చి నీవు చెప్పినదంతయు పరమ సత్యమే. ఓ పురుషోత్తమా! అపార ఙ్ఞాన శక్తి తేజములతో కూడిన మహా ఘనమైన నీ అనంత ఐశ్వర్య రూపమును ప్రత్యక్షముగ దర్శించగోరుచున్నాను.

|| 11-4 ||
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో|
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్

హే యోగేశ్వర ప్రభో! నీ ఘన విశ్వరూపం నాచేత చూడశక్యమైనదని నీవు తలంచుచో అట్టి నాశరహితమైన నీ దివ్య రూపమును నాకు చూపుము.

|| 11-5 ||
శ్రీభగవానువాచ|
పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః|
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ

ఓ పార్థా! అసంఖ్యాకములైన, అనేక విధములుగనున్న, అనేక వర్ణములు కలిగిన, అనేకాకృతులలోనున్న నా దివ్య రూపమును చూడుము.

|| 11-6 ||
పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా|
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత

ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ దేవతలను, సప్త మరుత్తులను నాలో చూడుము. మరియు మహాశ్చర్యమును కలిగించే పూర్వమెప్పుడూ ఎవ్వని చేత చూడబడని అనేక అద్భుతములను నాలో నిపుడుగాంచుము.

|| 11-7 ||
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్|
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి

ఓ అర్జునా! నాదేహమందే చరాచర ప్రపంచమునెల్లను ఒకే చోటనున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్ల నాలోనే చూడుము.

|| 11-8 ||
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా|
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్

నీ స్థూల దృష్టితో నా అనంత స్వరూప మహిమను చూడలేవు. కనుక దివ్యదృష్టి నీకిచ్చుచున్నాను. ఈ ఙ్ఞాన దృష్టితో అపారమైన నా విశ్వరూప వైభవమును గాంచుము.

|| 11-9 ||
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః|
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్

సంజయుడిట్లనియెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహా యోగీశ్వరుడైన భగవానుడిట్లు చెప్పిన పిమ్మట సర్వోత్తమమైన ఐశ్వర్యరూపమైన తన మహిమాన్విత విశ్వరూపమును పార్థునకు చూపెను.

|| 11-10 ||
అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్|
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్

అనేక వక్త్రములతో, అనేక నేత్రములతో, అనేక అద్భుత దర్శనములతో, అనేక దివ్యాభరణములతో, దివ్యాయుధములతో భగవానుని ఘన దివ్యరూపము శోభిల్లుచుండెను.

|| 11-11 ||
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్

దివ్యములైన పుష్పమాలికలను, దివ్యములైన వస్త్రములను ధరించి, దివ్య సుగంధ చందనాదుల పూతలతో నిండి, పరమాశ్చర్యకరమై, మహాకాంతివంతమై, అనంతమై, విశ్వతోముఖమై భగవానుని అద్భుత విశ్వరూపము విలసిల్లుచుండెను.

|| 11-12 ||
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా|
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః

ఆకాశమున ఒక్కతూరి హఠాత్తుగా సహస్ర సూర్యులు ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతిసలుగునో అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.

|| 11-13 ||
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా

అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును ఒకేచోటనున్న దానినిగా చూచెను.

|| 11-14 ||
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః|
ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత

పిమ్మట ధనంజయుడు విస్మయముతో పులకాంకితదేహుడై భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసి అంజలి బద్ధుడై ఇట్లనెను.

|| 11-15 ||
అర్జున ఉవాచ|
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్

అర్జునుడు పలికెను: ఓ దేవాదిదేవా! నీ విరాట్-రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.

|| 11-16 ||
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను.

|| 11-17 ||
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్

హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.

|| 11-18 ||
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే

పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలుసుకొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. అని నా విశ్వాసము.


|| 11-19 ||
అనాదిమధ్యాన్తమనన్తవీర్య-
మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్

నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.

|| 11-20 ||
ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్

ఓ మహాత్మా! దివినుండి భువివఱకుగల అంతరిక్షమునందతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అధ్బుతమైన నీ భయంకరరూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి.

|| 11-21 ||
అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి|
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసఙ్ఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః

ఇదిగో, ఆదేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిధ్దులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.

|| 11-22 ||
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|
గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్దసముదాయములును నిన్నే దర్శించుచున్నారు.

|| 11-23 ||
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్|
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్

ఓ మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమునుచూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణికిపోవుచున్నాను.

|| 11-24 ||
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో

ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అదే అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా దైర్యము సడలినది. శాంతి దూరమైనది.

|| 11-25 ||
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని|
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస

ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో (భయంకరమైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-26 ||
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః

ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతోసహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును.

|| 11-27 ||
వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని|
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మద్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.


|| 11-28 ||
యథా నదీనాం బహవోమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి|
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి

అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు.


|| 11-29 ||
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః|
తథైవ నాశాయ విశన్తి లోకాస్-
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః

మిడుతలన్నియు మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు.

|| 11-30 ||
లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-
లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో

హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపులనుంచి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.

|| 11-31 ||
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోస్తు తే దేవవర ప్రసీద|
విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను.

|| 11-32 ||
శ్రీభగవానువాచ|
కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః

శ్రీ భగవానుడు పలికెను : నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు (మిగిలియుండరు).

|| 11-33 ||
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్

కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

|| 11-34 ||
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ) కర్ణాది యుద్దవీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్దము చేయుము.

|| 11-35 ||
సఞ్జయ ఉవాచ|
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ|
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య

సంజయుడు పలికెను: ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మయొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను. మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.

|| 11-36 ||
అర్జున ఉవాచ|
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః

అర్జునుడు పలికెను: ఓ అంతర్యామి! కేశవా! నీనామగుణప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్దగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు.

|| 11-37 ||
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే|
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్

ఓమహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు - కనుక వారు (సిద్దాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్-అసత్లు నీవే. వాటికంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానందఘనపరబ్రహ్మవు నీవే.

|| 11-38 ||
త్వమాదిదేవః పురుషః పురాణస్-
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప

ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది.

|| 11-39 ||
వాయుర్యమోగ్నిర్వరుణః శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|
నమో నమస్తేऽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోऽపి నమో నమస్తే

నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు.

|| 11-40 ||
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోऽస్తు తే సర్వత ఏవ సర్వ|
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోऽసి సర్వః

అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే.

|| 11-41 ||
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి

నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరబాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని.

|| 11-42 ||
యచ్చావహాసార్థమసత్కృతోసి
విహారశయ్యాసనభోజనేషు|
ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం
తత్క్షామయే త్వామహమప్రమేయమ్

ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమునగాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములనన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను.

|| 11-43 ||
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్|
న త్వత్సమోऽస్త్యభ్యధికః కుతోన్యో
లోకత్రయేऽప్యప్రతిమప్రభావ

ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును?

|| 11-44 ||
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్|
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్

కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్ధించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును, నా అపరాధములను నీవు క్షమింపుము.


|| 11-45 ||
అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస

మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశా! జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-46 ||
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే

కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము.

|| 11-47 ||
శ్రీభగవానువాచ|
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్|
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్-రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మఱి యెవ్వరును చూచియుండలేదు.

|| 11-48 ||
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్-
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర

ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని, తదితరపుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకుదప్ప మఱియెవ్వరికిని చూడశక్యముగాదు.

|| 11-49 |
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్|
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య

ఈ విధమైన ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును,మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము.

|| 11-50 ||
సఞ్జయ ఉవాచ|
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః|
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా

సంజయుడు పలికెను: వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను.

|| 11-51 ||
అర్జున ఉవాచ|
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన|
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః

అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! మీ అతిసౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందరరూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక (సహజ)స్థితిని పొందితిని.

|| 11-52 ||
శ్రీభగవానువాచ|
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః

శ్రీ భగవానుడు పలికెను: నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలుసైతము ఈ రూపమును దర్శించుటకు సదా ఉవ్విళ్ళూరుచుందురు.

|| 11-53 ||
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా|
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా

నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేదపఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని శక్యము కాదు.

|| 11-54 ||
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప

ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్య భక్తిద్వారా మాత్రమే సాధ్యమగును.

|| 11-55 ||
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సఙ్గవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాణ్డవ

అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేనివాడును, ఏప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు.

|| 11 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపదర్శనయోగో నామైకాదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు: దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది. నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు. నీ విస్వరూపం చూడాలని ఉంది. నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.

శ్రీకృష్ణుడు:
అనేక విధాలైన, వర్ణాలు కలిగిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు. సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను. చూడు.

సంజయుడు:
ధృతరాష్ట్ర రాజా! అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా, వేయి సూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు. ఆశ్చర్య, ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు. అప్పుడు

అర్జునుడు:
హే మాహాదేవా! దివ్యమైన, ఆదీ అంతము లేని నీలో సమస్త దేవతలను, భూతగణాలను, పద్మాసనుడైన బ్రహ్మను, మహర్షులను అందరినీ చూస్తున్నాను. అన్ని వైపులా చేతులతో, ముఖాలతో, కన్నులతో ఉన్న నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను. అసంఖ్యాక కిరీటాలు, గదలు, చక్రాలు ధరించి సూర్యాగ్నుల తేజస్సుతో నీ రూపాన్ని చూస్తున్నాను. తెలుసుకోవలసిన పరమాత్మవు, ప్రపంచానికి ఆధారము, శాశ్వతుడవు, ధర్మరక్షకుడవు, పరబ్రహ్మంవు నువ్వే అని నిశ్చయించుకున్నాను. ఆధిమధ్యాంతరహితము, అపరిమిత శక్తి యుతము, అనంత బాహువులతో సూర్యచంద్రులే కన్నులుగా ప్రజ్వలితాగ్నిలా గల ముఖకాంతి గలది, తన తేజస్సుతో సమస్త విశ్వాన్ని తపింపచేస్తున్న నీ రూపాన్ని అర్థం చేసుకుంటున్నాను. సూదిమొన సందు లేని నీ మహోగ్రరూపం చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి. సమస్తదేవతా స్వరూపాలు నీలో ప్రవేశిస్తున్నాయి. ఋషులు, సిద్దులు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. అన్నిలోకాల వాసులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నాయి. నీ భయంకర విశ్వరూపాన్ని చూసి అన్ని లోకాలు, నేను భయపడుతున్నాము. నీ విశాల భయంకర నేత్రాలు జ్వలిస్తున్నాయి. నిన్ను చూస్తున్నకొద్ది నా మనసు చలించి ధైర్యం నశించిపోతోంది. నాకు శాంతి లేదు. కాలాగ్నిలా ఉన్న నిన్ను చూసి నేను భయపడిపోతున్నాను. నన్ను కరుణించు. అనేకమంది రాజులు, కౌరవులు, భీష్మద్రోణులు, కర్ణుడు నా యోధులు కూడా నీ భయంకర ముఖం లోనికి వెళ్తున్నారు. వారిలో కొందరు నీ కోరల మధ్య నలిగి చూర్ణమై పోతున్నారు. నదులు సముద్రంలో కలుస్తున్నట్లు రాజలోకమంతా నీ భయంకర ముఖాగ్ని లోనికి పొర్లుతోంది. అన్ని లోకాలు నీ ముఖంలోనికి పడి నాశనమవుతున్నాయి. నీవు అంతా మింగి వేస్తున్నావు. జగత్తు భయపడుతోంది. ఇంత భయంకరమైన నీవెవరవు? తెలియజెయ్యి. శ్రీకృష్ణుడు: సర్వస్వం లయం చేసే కాల స్వరూపుడిని నేను. ప్రస్తుతం నా పని సంహారం. నీవు యుద్ధం మానినా సరే నీవు, కొందరు తప్ప ఇక్కడ ఎవరూ మిగలరు. లే! యుద్ధానికి సిద్దపడు. శతృసంహారం చేసి భూమండలాన్ని అనుభవించు. నిమిత్తమాతృడవై యుద్ధం చేయి. ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదులు అందరినీ ముందే చంపివేశాను. నాచే చంపబడిన వారినే నువ్వు చంపబోతున్నావు. యుద్ధం చెయ్యి. జయిస్తావు.

అర్జునుడు:
నీ కీర్తన చేత జగం ఆనందిస్తోంది, రాక్షసులు భయంచే దిక్కు తోచక పరుగెడుతున్నారు. సిద్దులు నీకు మ్రొక్కుతున్నారు. సత్తుకు, అసత్తుకు, బ్రహ్మకు మూలపురుషుడైన నిన్ను నమస్కరించని వారెవరు ఉంటారు? ఆదిదేవుడవు, సనాతనుడవు, అంతా తెలిసిన వాడవు, సర్వ జగద్వ్యాపివి. బ్రహ్మ కన్నతండ్రివి, అగ్ని, వరుణుడు అన్నీ నీవే. నీకు నా పునఃపునః నమస్కారాలు. నిన్ను అన్నివైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీ మహిమను గుర్తించలేక చనువుతో కృష్ణా, సఖా, యాదవా అంటూ నిన్ను పిలిచాను. సరసాలాడాను. క్షమించు. నీకు సమానుడైన వాడే లేనప్పుడు నీ కన్నా అధికుడెలా ఉంటాడు? తండ్రి కొడుకుని, ప్రియుడు ప్రియురాలిని, మిత్రుడు మిత్రుని తప్పులు మన్నించినట్లు నన్ను మన్నించు. నీ ఈ రూపం చూసి భయం కల్గుతోంది. నీ శంఖ, చక్ర, కిరీట, గదా పూర్వకమైన మునుపటి రూపంలోనికి రా.

కృష్ణుడు:
నీ మీది కరుణతో నా తేజ విశ్వరూపాన్ని చూపించాను. నీవొక్కడు తప్ప పూర్వం ఈ రూపాన్ని ఎవరూ చూడలేదు. వేదాలు చదివినా, దానధర్మాలు, జపాలు, కర్మలు చేసినా ఎవరూ చూడలేకపోయారు. నీవు భయపడవద్దు. నా పూర్వరూపమే చూడు అంటూ సాధారణ రూపం చూపించాడు.

అర్జునుడు: ఇప్పుడు నా మనసు కుదుటపడింది.

కృష్ణుడు:
దేవతలు కూడా చూడాలని తపించే ఈ రూపదర్శనం తేలిక కాదు. వేదాలు చదివినా, దానాలు, పూజలు, తపస్సు చేసినా ఈ రూప దర్శనం కలుగదు. అనన్యభక్తితో మాత్రమే సాధ్యం అవుతుంది. నా కొరకే కర్మలు చేస్తూ, నన్నే నమ్మి, నా యందు భక్తి కల్గి విశ్వంలో నిస్సంగుడైనవాడు మాత్రమే నన్ను పొందగలడు.



1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete