Friday 17 March 2017

భగవద్గీత

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.


భగవద్గీత ఆవిర్భావం:
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత విశిష్టత:
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:

-->సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
-->పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
-->శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
-->ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
-->నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)

-->నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)

<img>1D509B48-76A4-4002-8F6A-87CD237B117C.jpg</img>
గీతా సారము:
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి). కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.

ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.

కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.

ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము


భగవద్గీత కాలం:
భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.

గీతా శ్లోక సంఖ్య:
భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రస్తుతం లభ్యమౌతున్న సంస్కృత మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:

షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.

ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలొ (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.

ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.








1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete