Friday, 17 March 2017

అర్జునవిషాద యోగము

అర్జునవిషాద యోగము, భగవద్గీతలో మొదటి అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


'అర్జునవిషాద యోగములో ముఖ్య విషయాలు : అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.

||శ్రీమద్భగవద్గీత ||

||ఓం శ్రీ పరమాత్మనే నమః ||

||అథ శ్రీమద్భగవద్గీతా ||

అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః


 ||1-1||:
ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ

ధృతరాష్ట్రుడు పలికెను.
ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?


||1-2||
సఞ్జయ ఉవాచ |
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్

సంజయుడు పలికెను:
అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను.

||1-3||
పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా

ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిషుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.


||1-4||
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః

ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు.


||1-5||
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః

దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు.


||1-6||
యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః

పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే.


||1-7||
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే

బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.


||1-8||
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.


||1-9||
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః

ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు.


||1-10||
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది.


||1-11||
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి

అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి.


||1-12||
తస్య సఞ్జనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్

అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు.


||1-13||
తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోభవత్

ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.

||1-14||
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు.


||1-15||
పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు.


||1-16||
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు.


||1-17||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః

ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ;


||1-18||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్

ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

||1-19||
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్

ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

||1-20||
అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః

అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు,

||1-21||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత

ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు.

||1-22||
యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే

యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి

||1-23||
యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.

||1-24||
సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్

సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి,

||1-25||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి

భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు.

||1-26||
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా

అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు.

||1-27||
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్

ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి,

||1-28||
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్

అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా;

||1-29||
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే

నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి.

||1-30||
గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః

గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది.

||1-31||
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే

కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.

||1-32||
న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా

ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి.

||1-33||
యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ

ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.

||1-34||
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు.

||1-35||
ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే

మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా?


||1-36||
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః

జనార్ధనా! దృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది.

||1-37||
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ

అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము.

||1-38||
యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్

లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ,

||1-39||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన

జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

||1-40||
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత

కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది.

||1-41||
అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః

కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.

||1-42||
సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

||1-43||
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః

వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి.

||1-44||
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ

జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము.

||1-45||
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః

అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.

||1-46||
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్

ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది.

||1-47||
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః

సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు.

||1||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయఃఆధ్యాయ సంగ్రహం:
ధృతరాష్ట్రుడు, సంజయుడు:
యుద్ధం ఆపమని వ్యాసుడు ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు. తాను అసహాయుడనని, ఆ పని తన వల్ల కాదని ధృతరాష్ట్రుడు విన్నవించుకొన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం అని గ్రహించిన తరువాత యుద్ధం విశేషాలు దర్శించడానికి, వివరించడానికి వీలుగా వ్యాసుడు సంజయునకు దివ్యమైన దృష్టి, అవగాహన, శీఘ్రగమనం వంటి శక్తులిచ్చాడు. వాటి సహాయంతో సంజయుడు ధృతరాష్ట్రుడికి భూమండలం విశేషాలు దర్శించి వివరించాడు. తరువాత రాజు ఆనతిపై యుద్ధభూమికి వెళ్ళాడు.

అలా వెళ్ళిన సంజయుడు పది రోజులకు గాని తిరిగి రాలేదు. వస్తూనే మహావీరుడు భీష్మ పితామహుడు రణభూమిలో కూలి అంపశయ్యపై విశ్రమించాడని చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. పిదప ధృతరాష్ట్రుడు మొదటినుండి యుద్ధం గురించి చెప్పమని సంజయుడిని ఇలా అడిగాడు.

ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నా బిడ్డలు, పాండవులు ఏమి చేశారు?
ఇదే భగవద్గీతలో మొదటి శ్లోకం. అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.

మహాయోధులు సిద్ధం:
వ్యూహాలు తీరియున్న సేనను చూసి దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని వద్దకు వెళ్ళి ఇరు పక్షాలలో మహాయోధులను గురించి ప్రస్తావించాడు. "పాండవుల పక్షాన సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఐదుగురు ద్రౌపది పుత్రులు (ప్రతివింధ్యుడు, సుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు) వంటి మహావీరులున్నారు. మన (కౌరవ) పక్షాన తమరు (ద్రోణుడు), భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు వంటి మహావీరులున్నారు. అంతా జీవితాలను పణంగా పెట్టి యుద్ధరంగానికి వచ్చారు. భీముని రక్షణలో ఉన్న పాండవ సేనకంటే భీష్ముని రక్షణలో ఉన్న కౌరవ సేన అపరిమితము, అజేయము. కనుక అందరూ భీష్ముని రక్షించడానికి సావధానంగా ఉండాలి" - అని దుర్యోధనుడు ద్రోణుడితో అన్నారు.

కురువృద్ధుడు, పితామహుడు అగు భీష్ముడు సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించాడు. కృష్ణుడు పాంచజన్య శంఖాన్నీ, అర్జునుడు దేవదత్త శంఖాన్నీ అలాగే ఇతరులు తమతమ శంఖాలనూ పూరించారు. భేరీ భాంకారాలతో యుద్ధరంగం దద్ధరిల్లింది.

అర్జునుని ఉత్సుకత:
అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం కపిధ్వజుడైన అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయోవృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూశాడు.

అర్జునుడి దుఃఖం:
వారిని చూడగానే గుండె కరిగిపోయి అర్జునుడు కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. "కృష్ణా! అందరూ మనవాళ్ళే, వారిలో కొందరు పూజ్యనీయులు. ఈ స్వజనాన్ని చూస్తుంటే నా శరీరావయవాలు పట్టు తప్పుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. గాండీవం చేజారుతున్నది. బంధుమిత్రులకోసమే మనం రాజ్య భోగాలు కోరుకుంటాం. అలాంటి బంధుమిత్రులే ఇక్కడ ప్రాణాలను వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. యుద్ధం కారణం చేత కుల క్షయం సంభవిస్తుంది. అయ్యో రాజ్య సుఖ లోభం కారణంగా స్వజనులను చంపే ఘోర పాపకృత్యానికి ఒడిగట్టాము కదా? ది దారుణం. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత నేను, నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి" అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.
No comments:

Post a comment