Friday, 17 March 2017

భక్తి యోగము

భక్తి యోగము, భగవద్గీతలో పన్నెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


అథ ద్వాదశోధ్యాయః - భక్తియోగః

|| 12-1 ||
అర్జున ఉవాచ|
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?

|| 12-2 ||
శ్రీభగవానువాచ|
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః

శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)

|| 12-3 ||
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే|
సర్వత్రగమచిన్త్యఞ్చ కూటస్థమచలన్ధ్రువమ్

కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, సకల భూతములకును హితమునే కోరుచుండువారును, సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.

|| 12-4 ||
సన్నియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః|
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః

అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.

|| 12-5 ||
క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్||
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే

నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.

|| 12-6 ||
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః|
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే

సర్వకర్మలన్నీనాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకుని మనస్సుని అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,

|| 12-7 ||
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్|
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్

అర్జునా నాలో మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.

|| 12-8 ||
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః

నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.

|| 12-9 ||
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ

ధనంజయా స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.

|| 12-10 ||
అభ్యాసేప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.

|| 12-11 ||
అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీ కోసం ఛెసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.

|| 12-12 ||
శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే|
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్

అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.

|| 12-13 ||
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ|
నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ

ఏ ప్రాణాన్ని ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, సుఖదుహ్కాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,

|| 12-14 ||

సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః

నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-15 ||
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః

ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో, సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు.

|| 12-16 ||
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః

అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-17 ||
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి|
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః

ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో సుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-18 ||
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః

శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు)

|| 12-19 ||
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః

నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-20 ||
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః

ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.

|| 12 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?

కృష్ణుడు:
నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కలిగిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు. సంతోషం,దుఃఖం,ద్వేషం,శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు. శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు. పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు.

No comments:

Post a comment