Friday 17 March 2017

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము, భగవద్గీతలో పదమూడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

|| 13-1 ||
అర్జున ఉవాచ|
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ|
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ

అర్జునుడిట్లనియెను: హే కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి తెలియగోరుచున్నాను.

|| 13-2 ||
శ్రీభగవానువాచ|
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః

శ్రీ భగవానుడిట్లనియెను: ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము నెవడెరుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.

|| 13-3 ||
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|
క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ

మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన జీవుని నన్నుగా ఎరుగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా మతము.

|| 13-4 ||
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్|
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు

ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన బుట్టినదో, ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని సంగ్రహముగా నాద్వారా వినుము.

|| 13-5 ||
ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్|
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః

ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధాలుగా వివరింపబడినది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది పలు విధములుగా విభజించి నిరూపించబడినది. బ్రహ్మసూత్ర పదాలు దీనిని గురించి హేతు బద్ధంగా నిశ్చయించి చెప్పాయి.

|| 13-6 ||
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ|
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః

మహాభూతాలు(ఐదు)అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి), ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ(మొత్తం 24క్షేత్రాలు)

|| 13-7 ||
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః|
ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్

ఇచ్చ, ద్వేషం, సుఖఅం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల ఇవి వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైంది.

|| 13-8 ||
అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్|
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః

తనని తాను పొగడక పోవడం, ఢంభము లేకుండా ఉండడమూ, అహింసా, ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, ఆత్మనిగ్రహమూ.

|| 13-9 ||
ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ|
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్

ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో, దుఃఖాన్ని, దోషాన్ని నిత్యమూ చూడటమూ,

|| 13-10 ||
అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు|
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు

ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితోతాధాత్మ్యము చెందక పోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానిది ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,

|| 13-11 ||
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది

ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో గడపడమూ, జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,

|| 13-12 ||
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా

నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనది అంతా అజ్ఞానము.

|| 13-13 ||
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే

దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది.

|| 13-14 ||
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్|
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి

దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి, అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.

|| 13-15 ||
సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ

అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా కూడా గుణాలను భోగించేది.

|| 13-16 ||
బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ|
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్

అది(జ్ఞేయము)జీవుళ్ళకు బయటా, లోపలా ఉండేది, కదిలేది కదలనిది కూడా ఐనా, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు. (అవిద్వాంసులకు)దూరంగానూ, విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.

|| 13-17 ||
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్|
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ

ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవుళ్ళలో విభజింపబడి నట్లుగానూ, జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి.

|| 13-18 ||
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే|
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్

వెలుగలకు వెలుగది. (అజ్ఞానమనే)చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది.

|| 13-19 ||
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే

క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందుతాడు.

|| 13-20 ||
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్

ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో.

|| 13-21 ||
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే

కార్యకార్యాల తయారీకి ప్రకృతి కారణము అని చెప్పబడుతుంది. సుఖదుఃఖాల అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడతాడు.

|| 13-22 ||
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు

ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచీ, చెడు జన్మలెత్తడానికి కారణము.

|| 13-23 ||
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః

ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ చెప్పబడుతున్నాడు.

|| 13-24 ||
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే

పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణీ, గుణాలతో సహా ప్రకృతినీ ఎవరు తెలుసుకుంటారో, అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు.

|| 13-25 |
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే|

కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను ఆత్మను చూస్తారు.

|| 13-26 ||
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః

ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.

|| 13-27 ||
యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ

భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

|| 13-28 ||
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి

నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

|| 13-29 ||
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.

|| 13-30 ||
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి

అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు.

|| 13-31 ||
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.

|| 13-32 ||
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

|| 13-33 ||
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే

ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.

|| 13-34 ||
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత

ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింప చేస్తాడో, అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.

|| 13-35 ||
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా|
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్

ఈ ప్రకారంగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని చేరుకుంటారు.

|| 13 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు:
ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అనగా ఏమిటి?

కృష్ణుడు:
దేహాన్ని క్షేత్రమని, దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞున్ని. క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను విను. ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు. బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలు, ఇష్టద్వేషాలు, తెలివి, ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు.


అభిమానము, డంబము లేకపోవడం, అహింస, ఓర్పు, కపటం లేకపోవడం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాతృడిగా గుర్తించడం, భార్యాబిడ్డలందు, ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం, శుభాశుభాల యందు సమత్వం, అనన్య భక్తి నాయందు కల్గిఉండడం, ఏకాంత వాసం, నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం.


సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మం ను తెలుసుకొంటే మోక్షం వస్తుంది. ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది. ఈ పరబ్రహ్మతత్వం అన్నిటియందు కలిసిఉన్నట్లు కనిపించినా దేనితోనూ కలవదు. కాని అన్నిటినీ భరిస్తూ పోషిస్తోంది. నిర్గుణమై ఉండీ గుణాలను అనుభవించేదీనని తెలుసుకో.

అది సర్వభూతాలకూ లోపలా, బయట కూడా ఉంది. అది సూక్షం. తెలుసుకోవడం అసాధ్యం. గుర్తించిన వారికి సమీపంలోనూ, మిగతావారికి దూరంలో ఉంటుంది. ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది. సృష్టిస్థితిలయ కారకం అదే. అది సూర్యుడు, అగ్నులకు తేజస్సును ఇస్తుంది. చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, జ్ఞేయం, సర్వుల హృదయాలలో ఉండేది. జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రం ఈ మూడూ తెలుసుకొన్న వాడు భక్తుడై మోక్షం పొందగలడు. ప్రకృతి పురుషులు తెలియబడని మొదలు గలవి. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖదుఃఖాలు ప్రకృతి వలనే పుడుతున్నాయి. దేహ, ఇంద్రియాల పనికి ప్రకృతి-సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు మూలం. జీవుడు త్రిగుణాల వలన సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం. తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షి, పోషకుడు, భోగి ఐన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఈ విషయాలను గురించి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మబుద్దితో హృదయంలోనూ, మరికొందరు యోగధ్యానం వలనా, జ్ఞానయోగం వలనా, కొందరు నిష్కామయోగం ద్వారా దర్శిస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం తెలియనివారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా సంసారాన్ని తరిస్తారు. ఈ ప్రాణులంతా క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక కారణం. అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగినవాడు మాత్రమే నిజంగా చూసినవాడు. ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడుచేసుకోడు. పరమగతిని పొందుతాడు. ఆత్మ ఏ కర్మా చేయదనీ, ప్రకృతే చేస్తుందని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అన్ని జీవులనూ ఆత్మగా చూస్తూ ఆనీ ఆత్మ అని గ్రహించిన మనిషే బ్రహ్మత్వం పొందుతాడు. పుట్టుక, గుణం, వికారం లేనిది కావడం చే శరీరమందున్నా కర్తృత్వం కానీ, కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు. శరీరగుణాలు ఆత్మకు అంటవు. ఒక్క సూరుయ్డే జగత్తును ప్రకాశింప చేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, మాయాబంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకొన్నవాడే పరమగతినీ పొందుతాడు.




1 comment:

  1. కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete